నట వారసులను హీరోలుగా తెరకు పరిచయం చేయడం కత్తి మీద సామువంటిది. కానీ వారిని లాంఛ్ చేయడంలో సక్సెస్ అయితే మాత్రం ఇక ఆ దర్శకులకు ఎక్కడలేని డిమాండ్ వస్తుంది. ఈ విషయంలో టాలీవుడ్‌లోని ఇద్దరు టాప్ డైరెక్టర్స్ బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్‌ను చిరుతతో అద్బుతంగా అరంగేట్రం చేయించాడు పూరీజగన్నాథ్. అంతముందే ఆయన కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్ తనయుడు పునీత్‌రాజ్‌కుమార్‌ను కూడా కన్నడంలో అద్భుతమైన ఎంట్రీ ఇప్పించాడు. వీరిద్దరూ ఇప్పుడు ఆయా పరిశ్రమల్లో స్టార్స్‌గా వెలుగొందుతున్నారు. కాగా త్వరలో పూరీ మరో వారసుడిని హీరోగా పరిచయం చేయనున్నాడు. ఇషాన్ అనే వారసుడితో ఆయన కన్నడ, తెలుగు భాషల్లో రోగ్ అనే టైటిల్‌తో పరిచయం చేసే భాద్యతను తన భుజాలపైకి ఎత్తుకున్నాడు. ఇక వారసులను పరిచయం చేయడంలో వి.వి.వినాయక్ కూడా తక్కువేం తినలేదు. భారీ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను అల్లుడుశీను తో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశాడు. ఓవర్ బడ్జెట్ వల్ల ఈ చిత్రం కమర్షియల్‌గా పెద్దగా లాభాలను తెచ్చిపెట్టనప్పటికీ హీరోగా పరిచయం అయిన సాయి శ్రీనివాస్‌కు కమర్షియల్‌హీరోగా మంచి బాటనే వేసింది. సాయి శ్రీనివాస్‌ను తన మొదటి చిత్రంతోనే వినాయక్ ప్రెజెంట్ చేసిన తీరు చూసి ఏకంగా నాగార్జున తన చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ డెబ్యూ మూవీ అఖిల్‌ను ఎంట్రీకి సిద్దం చేస్తున్నాడు. ఈ చిత్రం కనుక హిట్ అయితే ఇక కొత్త వారసులను పరిచయం చేయాలని భావించే అందరికీ పూరీ, వినాయక్‌లు బెస్ట్ ఆప్షన్‌గా మారుతారు అనడంలో సందేహం లేదు..!