అనుష్క, తమన్నా, శృతిహాసన్, సమంత.. ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే టాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్ల జాబితా చాంతాడంత ఉంటుంది. అయితే వీరి కంటే రకుల్‌ప్రీత్‌సింగ్, రెజీనా వంటి హీరోయిన్లు బెటర్. టాలీవుడ్‌లో సెటిలైన వెంటనే తెలుగుభాషను బాగా నేర్చుకొని త్వరలో తమ సినిమాలలోని క్యారెక్టర్లకు ఓన్‌గా తమ సొంతం గొంతు వినిపించడానికి రెడీ అవుతున్నారు. అరువు గొంతులపై ఆధారపడకుండా తెలుగును ఇంకా స్వచ్చంగా నేర్చుకుంటున్నారు. కానీ కోలీవుడ్ హీరోయిన్లయిన సమంత, శృతిహాసన్‌లకు తెలుగులో స్టార్‌డమ్ వచ్చినా ఇంకా అరువు గొంతులపైనే ఆధారపడుతున్నారు. అదే తమిళ విషయాలకొస్తే ఇటీవలే విడుదలైన విజయ్ పులి చిత్రానికి శృతిహాసన్ ఓన్‌గా డబ్బింగ్ చెప్పింది. అడపాదడపా వచ్చే బాలీవుడు చిత్రాలకు కూడా ఆమె ఓన్ వాయిస్ వినిపిస్తోంది. కానీ తెలుగు విషయానికి వస్తే మాత్రం ఆమె ఓన్‌గా డబ్బింగ్ చెప్పడానికి నో అంటోంది. ఇక సమంత విషయానికి వస్తే ఆమె విక్రమ్‌తో కలిసి నటిస్తున్న 10ఎంద్రాకులం చిత్రానికి తమిళంలో సమంత ఓన్ వాయిస్‌తో డబ్బింగ్ చెప్పింది. అదే సినిమా తెలుగు అనువాదంలో మాత్రం బయటివారిని డబ్బింగ్ చెప్పించుకోమని కండీషన్ పెట్టింది. ఇక దాదాపు 13ఏళ్ల నుండి తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఉన్న త్రిష కమల్‌హాసన్‌తో కలిసి నటిస్తున్న తుంగావనం చిత్రంలో తానే డబ్బింగ్ చెప్పింది. కానీ చీకటిరాజ్యంలో మాత్రం ఆమె డబ్బింగ్ చెప్పడానికి మొరాయిస్తోంది. తెలుగు సరిగ్గా రాకపోతే తప్పుపట్టలేం కానీ.. తెలుగు స్వచ్చంగా మాట్లాడే వారు మాత్రం ఇతర భాషల్లో ఓన్ వాయిస్‌తో డబ్బింగ్ చెప్పి, తెలుగు విషయంలో మాత్రం నో చెబుతుండటం బాధాకరం.