తమిళంలో జయం రవి హీరోగా జయం రాజా దర్శకత్వంలో రూపొందిన తని ఒరువన్ చిత్రం అక్కడ సంచలన విజయం సాధిస్తోంది. కాగా ఇందులో మంచిగా కనిపించే విలన్‌గా నటించిన అరవింద్ స్వామికి ఎంతో మంచి పేరు వచ్చింది. త్వరలో ఈ చిత్రం రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మొదట స్వామి స్థానంలో రానాను అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ పాత్రను రానా చేత కాకుండా హీరో నాగార్జున చేత చేయించాలని ఈ చిత్రం యూనిట్ భావిస్తున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం నాగ్ హీరో పాత్రల కన్నా విభిన్నమైన పాత్రల వైపు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం కార్తీతో కలిసి ఊపిరి చిత్రం చేస్తున్నాడు. కాగా అరవింద్‌స్వామి పోషించిన పాత్రను పోషించమని ఇప్పటికే నాగ్‌ను అడిగారని, ఈ విషయమై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మరి ఈ పాత్ర చేయడానికి నాగ్ ఒప్పుకుంటే ఇక ఈ సినిమాకు ఎక్కడలేని క్రేజ్‌రావడం మాత్రం ఖాయమని చెప్పవచ్చు.