ఈమధ్య పరభాషలో రూపొందిన పలు విజయవంతమైన చిత్రాలను తెలుగులో రీమేక్ చేయడానికి నిర్మాతలు, స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ ఈ చిత్రాలకు డైరెక్టర్లు మాత్రం ఇంకా ఫైనలైజ్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌లు ఆలస్యం అవుతున్నాయి. తమిళంలో ఘనవిజయం సాధించిన కత్తి ని మొదట ఎన్టీఆర్ చేస్తున్నాడు అన్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేయనున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. ఈ ఇద్దరులో ఎవరు సినిమా చేసినా దర్శకుడు ఎవరు? అనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఇక మలయాళంలో ఘనవిజయం సాధించిన ప్రేమమ్ చిత్రాన్ని తొలుత శర్వానంద్‌తో చేస్తారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రామ్ పేరు వినిపించింది. చివరకు ఇప్పుడు నాగచైతన్య ఫైనల్ అయినట్లు సమాచారం. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తాడని అంటున్నప్పటికీ ఏ విషయం ఇంకా
అధికారికంగా ఓకే కాలేదు. ఇక ఇటీవల తమిళంలో ఘనవిజయం సాదించిన తని ఒరువన్ రీమేక్‌లో రామ్‌చరణ్ హీరోగా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రాన్ని తమిళ ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు జయం రాజా చేస్తాడా? లేక సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందా? అనేది తేలడం లేదు. సురేందర్‌రెడ్డికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాగా ఈచిత్రాన్ని డివివి దానయ్యతో కలిసి సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మించనుంది. అలాగే హిందీలో సూపర్‌హిట్ అయిన స్పెషల్ చబ్బీస్ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచన ఎప్పటినుండో ఉంది. ఈ చిత్రంలో నటించడానికి రవితేజ సుముఖంగా ఉన్నాడు. కానీ దర్శకుడు ఎవరు? అనేది ఫైనల్ కాలేదు. ఇలా పలు రీమేక్ చిత్రాలకు దర్శకుల ఎంపిక క్లిష్టంగా మారుతోంది.