40, 50కోట్లు ఖర్చుపెట్టి 60, 70కోట్లు పొందడం కన్నా ఆరేడుకోట్లతో సినిమా తీసి 25, 30కోట్లు సంపాదించడమే నిజమైన విజయం అని చెప్పాలి. అందుకే ఈ మధ్య చాలా మంది పెద్ద పెద్ద నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చిన్న సినిమాలతో భారీ లాభాలను కొల్లగొడుతూ తమ సత్తా చాటుతున్నారు. ఉదాహరణకు ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన పటాస్ చిత్రం ఓ పెద్ద ఉదాహరణ. ఈ చిత్రం హక్కులను చేజిక్కించుకున్న దిల్‌రాజు ఈ చిత్రం ద్వారా భారీ లాభాలను ఆర్జించాడు. ఇక ఇటీవల వచ్చిన సినిమా చూపిస్త మావ చిత్రం ద్వారా కూడా దిల్‌రాజు కాసుల పంట పండించుకున్నాడు. ఇక గీతాఆర్ట్స్, యువి క్రియేషన్స్ కలిసి నాని హీరోగా రూపొందిన భలే భలే మగాడివోయ్ చిత్రం కేవలం ఐదారుకోట్లతో రూపొంది 30కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. దీని ద్వారా గీతాఆర్ట్స్ సంస్థకు, యువి క్రియేషన్స్ అధినేతలకు లాభాల వర్షం కురుస్తోంది. దీంతో మంచి కథాబలం ఉన్న చిన్న చిత్రాలను తీసి భారీ లాభాలు పొందాలని పలువురు భారీ నిర్మాతలు కూడా ఆ వైపుగా పయనిస్తున్నారు.