బాహుబలి1 విషయంలో కొన్ని పొరపాట్లు జరిగాయి. వాటిని దృష్టిలో ఉంచుకొన్న రాజమౌళి ఈ చిత్రం సెకండ్ పార్ట్‌లో మాత్రం అలాంటి తప్పులు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రం విషయంలో జక్కన్న కొత్త పద్దతులతో ముందుకు వెళ్తున్నాడు. సాధారణంగా తన సినిమా స్టోరీని యూనిట్‌లోని ముఖ్యులందరికీ వివరించి, వారి సలహాలను తీసుకోవడం జక్కన్నకు అలవాటు. అయితే దీని వల్ల పలు సమస్యలు తలెత్తుతున్నాయ. తెలిసి తెలియక కొందరు యూనిట్ సభ్యులు సినిమా గురించిన విషయాలను బహిరంగ పరుస్తున్నారు. బాహుబలి1 లో ఇదే పొరపాటు జరిగింది. ఈ చిత్రంలోని పలు విశేషాలు కొందరు యూనిట్ సభ్యుల ద్వారా బయటకు వచ్చి మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. పార్ట్1 విషయంలో స్టోరీ కూడా ముందే లీకయింది. దాంతో పార్ట్1లో జరిగిన పొరపాట్లు పార్ట్2లో జరగకుండా జక్కన్న కఠినంగా వ్యవహరిస్తున్నాడు. పార్ట్2కి సంబందించిన ఏ విషయం కూడా బయటకు లీక్ కాకూడదని, స్టోరీపై ఎవ్వరూ పెదవి విప్పరాదని హుకుం జారీ చేశాడు. ఎవ్వరూ కూడా మీడియా ముందు ఈ చిత్రం గురించి మాట్లాడవద్దని, ఎవరు ఏమి ప్రశ్నించినా అంతా రాజమౌళి గారికే తెలుసు.. మాకేమీ తెలియదు.. అని చెప్పాలని రూల్స్ పాస్ చేశాడు. వాస్తవానికి ఇలా సినిమాకు సంబంధించిన ఏ విషయం ఎక్కడా పెదవి విప్పకూడదనేది ఇప్పటివరకు శంకర్ స్కూల్‌లో ఉండేది. ఇప్పుడు జక్కన్న కూడా అదే స్కూల్ రూల్స్ పాటిస్తున్నాడు.