కీరవాణి, విజయేంద్రప్రసాద్‌లు లేకుండా రాజమౌళి చిత్రాలను ఊహించలేం. రాజమౌళి చిత్రాలకు కీరవాణి తన శక్తి మొత్తాన్ని దారపోస్తాడు. దాంతో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలన్నీ అద్భుతమైన మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. అయితే బాహుబలి2 తర్వాత కీరవాణి సంగీత దర్శకునిగా రిటైర్‌మెంట్ తీసుకుంటానని ఎప్పుడో ప్రకటించాడు. ఆ నిర్ణయాన్ని ఆయన చేత విరమింపజేయాలని ఎందరు ప్రయత్నించినా కీరవాణి మాత్రం తన మాటకే కట్టుబడి ఉన్నాడట. దీంతో కీరవాణి తర్వాత ఆ స్ధానంలోకి సంగీత దర్శకుడు కళ్యాణ్ కోడూరి వచ్చి చేరుతాడనే వార్తలు వినిపించాయి. కానీ దీనికి కళ్యాణ్ అంగీకరించలేదట. రాజమౌళి చిత్రాలకు సంగీతం అందించే స్థాయి, శక్తి తనకు లేవని కళ్యాణ్ తెగేసి చెప్పడంతో ఇప్పుడు రాబోయే రాజమౌళి చిత్రాలకు ఎవరు సంగీతం అందించనున్నారు? అనే అంశంపై చర్చ జరుగుతోంది. కాగా బాహుబలి2 తర్వాత కూడా రాజమౌళి తీసే చిత్రాలు దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు బాలీవుడ్‌లో కూడా విడుదలయ్యే అవకాశం ఉండటంతో రాజమౌళికి ఏ.ఆర్.రెహ్మాన్ సరిపోతాడని ఆయన సన్నిహితులు రాజమౌళికి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే రాజమౌళి టీంలోకి రహ్మాన్ వచ్చి చేరితే ఇక రాజమౌళికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని విశ్లేషకులు భావిస్తున్నారు.