నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలను ఈ ఏడాది ఘనంగా నిర్వహించారు. బాలయ్యకు ఎంత ప్రాముఖ్యం ఇస్తారో ఈసారి మోక్షజ్ఞకు కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు నందమూరి అభిమానులు. ఎప్పుడు లేనది ఈసారి మోక్షజ్ఞ బర్త్‌డే సంబరాలను ఇంత భారీ స్థాయిలో జరపడానికి కారణం అతి త్వరలోనే ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వనుండటమే అంటున్నారు. వచ్చే ఏడాది ఆయన పుట్టినరోజు నాటికి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది. ఈమధ్య మోక్షజ్ఞను ఎక్కువగా మీడియా కంటపడకుండా బాలయ్య జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. కేవలం లెజెండ్ చిత్రం షూటింగ్ సమయంలో లొకేషన్‌లో మోక్షజ్ఞ సందడికి సంబంధించిన ఫొటోలు తర్వాత ఆయన మరలా మీడియా కంటపడలేదు. ప్రస్తుతం మోక్షజ్ఞ విదేశాల్లో నటనకు సంబంధించిన శిక్షణతో పాటు గుర్రపుస్వారీ, ఫైట్స్, డ్యాన్స్‌లు, బాడీలాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ వంటి విషయాల్లో శిక్షణ పొందుతున్నాడు. కాగా బాలయ్య తన 100వ సినిమా ఆడియో వేడుకలో అందరికీ మోక్షజ్ఞను పరిచయం చేసి, తన నటవారసునిగా ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఫిల్మ్‌నగర్ టాక్.