మెగాహీరో వరుణ్‌తేజ్, ప్రజ్ఞాజైస్వాల్ జంటగా రెండో ప్రపంచ యుద్దం నాటి కాలంలో సాగే ఓ లవ్‌స్టోరీని దర్శకుడు క్రిష్ కంచె టైటిల్‌తో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పోస్టర్స్, ట్రైలర్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ కాలం నాటి పరిస్థితులను చూపించేందుకు వేసిన సెట్లు, యుద్ద సన్నివేశాలు, కాస్ట్యూమ్స్, ఆయుధాలు, మేకప్... ఇలా ఆనాటి కాలాన్ని తలపించేలా జార్జియాలో జరిపిన షూటింగ్ సన్నివేశాలు ... ఇలా అన్ని కలిపి ఈ కంచె చిత్రం బడ్జెట్ 21కోట్లు దాటిందని దర్శకనిర్మాత అయిన క్రిష్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. వాస్తవానికి ఈ చిత్రం నిర్మాతల పేర్లు వేరే విధంగా ఉన్నా అసలు నిర్మాత మాత్రం క్రిష్ అనేది బహిరంగ రహస్యమే. కాగా వరుణ్‌తేజ్ మెగా హీరో అయినప్పటికీ ఆయనకున్న స్టామినా, మార్కెట్ ఏమిటో ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియలేదు. తొలి చిత్రం ముకుందా కొన్న వారికి, నిర్మాతలకు నష్టాలనే మిగిల్చిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అలాంటి హీరోపై 21కోట్లు ఖర్చుపెట్టడం అంటే సాహసమే అని చెప్పాలి. అయినా మెగాఫ్యామిలీకి ఉన్న క్రేజ్, సినిమా హిట్టయితే వచ్చే కలెక్షన్లు, మెగాహీరోలకు ఉండే భారీ ఓపెనింగ్స్, కథపై నమ్మకం వంటివి దృష్టిలోఉంచుకొని క్రిష్ వరుణ్‌తేజ్‌పై ఇంత మొత్తం పెట్టుబడి పెట్టాడని అంటున్నారు.