మహేష్‌బాబు హీరోగా 'శ్రీమంతుడు' చిత్రం విడుదలై ఘనవిజయం సాధిస్తోన్న విషయం తెలిసిందే. ఊరికి ఏదైనా మంచి చేయాలనే కాన్సెప్ట్ ఎంతో మందిలో మార్పు తెచ్చింది. సినిమా చూసిన తర్వాత పలువురు తమ ఊరికి ఏదైనా మంచి చేయాలని ముందుకొస్తున్నారు. ఈమధ్యకాలంలో జనాల్లో ఒక మంచి ఆలోచనలకు బీజం వేసి, ఆచరణలో పెట్టేలా ప్రభావం చూపిన సినిమా 'శ్రీమంతుడు'. ఈ చిత్రంలో చెప్పినట్లుగానే హీరో మహేష్‌బాబు తన తండ్రి పుట్టిన గ్రామం బుర్రిపాళెంను దత్తత తీసుకున్నాడు. అంతేగాక తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని చింతలకుంట గ్రామాన్ని కూడా దత్తత తీసుకునేందుకు సిద్దమయ్యాడు. అయితే తాజాగా మహేష్‌కు కొత్త తలనొప్పి తయారైంది. ఖమ్మం జిల్లాలోని ముసలిమడుగు గ్రామానికి చెందిన వారు మహేష్ తమను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. మహేష్ తల్లి ఇంద్రాదేెవి పుట్టింది ఈ ఊరులోనే కావడం విశేషం. ఆమె నివసించిన ఇల్లు కూడా అక్కడ ఉంది. ప్రస్తుతం ఆ ఇల్లు శిధిలావస్థలో ఉంది. దీంతో ఈ గ్రామాన్ని మహేష్ దత్తత తీసుకోవాలని అక్కడి ప్రజలు అంటున్నారు. తన తల్లి పుట్టిన ఊరును కాకుండా ఇతర ఊర్లను దత్తత తీసుకోవడం ఏమిటని? వారు ప్రశ్నిస్తున్నారు.