ఒక సినిమా సూపర్‌హిట్ అవ్వాలంటే కథ ప్రధానం అని అందరూ ఒప్పుకుంటారు. అయితే అసలు సినిమాలో కథ అనేది లేకుండా కేవలం హీరో ఇమేజ్ వల్ల, ఆ హీరో అందించే ఎంటర్‌టైన్‌మెంట్ వల్ల, డైరెక్టర్ బ్రాండ్ వల్ల హిట్ అవుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం తెలుగు సినిమాలకు కథల కరవు వచ్చిందని ఇండస్ట్రీ పెద్దలు చెప్తున్నారు. అందుకే ఇతర భాషల్లో సూపర్‌హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసేందుకు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు మన హీరోలు, దర్శకులు. దానికి మలయాళ భాషలో వచ్చిన సినిమాలే కరెక్ట్ అనుకున్నారో ఏమో ఆమధ్య 'దృశ్యం' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసి విజయం సాధించారు. ఇదే చిత్రాన్ని తమిళ్‌లో కూడా చేసి సక్సెస్ సాధించారు. హిందీలో మాత్రం అంతంత మాత్రంగా ఆడింది. తెలుగు హీరోలే కాదు, తమిళ హీరోలు కూడా మలయాళ సినిమాలను రీమేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మలయాళంలో సూపర్‌హిట్ అయిన ప్రేమమ్ చిత్రాన్ని నాగచైతన్య తెలుగులో చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ్‌లో సూర్య, ధనుష్ ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ప్రేమమ్ చిత్రంలో హీరోగా నటించిన నివిన్ పాలీ గతంలో చేసిన సినిమాల్లో కొన్ని సూపర్‌హిట్ అయ్యాయి. ఇప్పుడు ఆ చిత్రాల కథలతో తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చెయ్యడానికి రెడీ అవుతున్నారు దర్శకనిర్మాతలు.
మమ్ముట్టి హీరోగా చేసిన సూపర్‌హిట్ చిత్రం భాస్కర్ ది రాస్కేల్ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. అలాగే బెంగుళూర్ డేస్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మలయాళ సినిమాలు రీమేక్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతామన్న నమ్మకంతో తెలుగు, తమిళ హీరోలు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.