సినిమా అనేది రంగుల ప్రపంచం. బయటి నుంచి చూసేవారికి ఆ రంగులు మాత్రమే కనిపిస్తాయి. అందంగా కనిపించే ఆ రంగుల ప్రపంచం వెనుక విషాదాలు, జీవన పోరాటాలు, ఒడిదుడుకులు, అపవాదులు, అవమానాలు, విజయాలు, అపజయాలు లాంటి కనిపించని రంగులు ఎన్నో వుంటాయి. హీరోలుగా, హీరోయిన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎంతో పేరు తెచ్చుకొని ఇండస్ట్రీలో ప్రముఖులుగా కొనసాగుతున్న అందరి జీవితాల్లో పైన చెప్పినవన్నీ వుంటాయి. అయితే అవి వారి మనసు లోతుల్లోనే వుంటాయి. సన్నిహితులకు తప్ప బయటివారికి ఈ విషయాలు తెలీదు. అవి ఇతరులకు చెప్పాలన్న ఆలోచన కూడా వారికి రాదు. ఒకవేళ చెప్పాల్సి వస్తే ఎదుటివారి వల్ల ఎదర్కొన్న అవమానాల గురించి చెప్పాలి. సినీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో తను చేసిన తప్పుల గురించి చెప్పాలి. కాబట్టి ఆ సాహసం ఎవ్వరూ చెయ్యరు.
కానీ, అలాంటి సాహసం చెయ్యడానికి మన ముందుకు రాబోతున్నాడు ఓ విలక్షణ నటుడు. తండ్రి ప్రముఖ దర్శకనిర్మాత, కొడుకు పేరుతోనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించడమే కాకుండా కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆయనే జగపతి పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్. ఆయన తనయుడు జగపతిబాబు. 'సింహస్వప్నం' చిత్రంతో హీరోగా పరిచయమై ఆ తర్వాత ఫ్యామిలీ హీరోగా అందరి ప్రశంసలు అందుకొని లెక్కకు మించిన సూపర్‌హిట్ చిత్రాల్లో నటించారు. ఫ్యామిలీ హీరోగా శోభన్‌బాబు తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న జగపతిబాబు సినీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. హీరోగా సినిమాలు తగ్గిన తర్వాత ఆమధ్య 'లెజెండ్' చిత్రంలో విలన్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు. లేటెస్ట్‌గా 'శ్రీమంతుడు' చిత్రంలో మహేష్‌బాబు తండ్రిగా ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశారు.
అతని కెరీర్ గ్రాఫ్ ఇలా వుంటే ఇప్పుడు జగపతిబాబు ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే తను సినిమాల్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి తన జీవితంలో జరిగిన సంఘటనలు, తను పొందిన ప్రశంసలు, అవమానాలు వంటి ఎన్నో వాస్తవ సంఘటనల్ని తన మాటల్లోనే బుల్లితెరపై కొన్ని ఎపిసోడ్స్ ద్వారా చెప్పబోతున్నారు జగపతిబాబు. భారతదేశంలో ఇప్పటివరకు ఏ హీరో చెయ్యని సాహసం జగపతిబాబు చెయ్యబోతున్నారు.
దీనికి సంబంధించిన స్ట్రిప్ట్ వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. వివిధ ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సీరియల్‌కి 'సముద్రం' అనే పేరుని కూడా కన్‌ఫర్మ్ చేశారు. మ్యాంగో వంశీ నిర్మాణ సారధ్యంలో రూపొందనున్న ఈ సీరియల్‌కి సినీ జర్నలిస్ట్ వంశీచంద్ర వట్టికూటి రచయితగా వ్యవహరిస్తున్నారు. ఓ ప్రముఖ టి.వి. ఛానల్ ఈ సీరియల్‌ని ప్రసారం చెయ్యబోతోంది.