ఒకప్పుడు చిన్న సినిమా, పెద్ద సినిమా అనే భేదాలు ఎక్కువగా లేవు. పెద్ద హీరో సినిమా అయినా, కొత్తవాళ్ళతో చేసిన సినిమా అయినా మంచి కథ, కథనాలు వుంటే ప్రేక్షకులు ఆ సినిమాని పెద్ద హిట్ చేసేవారు. అప్పటి హీరోలు పెద్ద బడ్జెట్ సినిమాలు చేసేవారు, చిన్న బడ్జెట్ సినిమాలు చేసేవారు. అలాగే డైరెక్టర్లు కూడా పెద్ద సినిమాలే చెయ్యాలన్న నియమాలు పెట్టుకోకుండా కథను నమ్మి సినిమాలు తీసేవారు. ఎప్పుడైతే హీరోలకు స్టార్ ఇమేజ్ వచ్చిందో అప్పటి నుంచి సినిమాకి సంబంధించిన లెక్కలు మారిపోయాయి. హీరోలతోపాటు ఇప్పుడు డైరెక్టర్లకు కూడా స్టార్ డమ్ వచ్చేసింది. దీంతో పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లు చిన్న సినిమాల వైపు కన్నెత్తి కూడా చూసే పరిస్థితి కనిపించడం లేదు. హీరోలుగా తమని తాము ప్రూవ్ చేసుకోవాలని వచ్చే కొత్త హీరోలు, తమ కొత్త కాన్సెప్ట్‌లతో డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కనే డైరెక్టర్లకు వారు కన్న కలలు కల్లలుగానే మిగిలిపోయే వాతావరణం ఇప్పుడు ఇండస్ట్రీలో కనిపిస్తోంది. నెలరోజులుగా బాహుబలి చిత్రాన్ని భుజాలపై వేసుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ప్రేక్షకులు దాని తర్వాత వచ్చిన శ్రీమంతుడు చిత్రానికి కూడా ఘనవిజయాన్ని చేకూర్చారు. ఈ గ్యాప్‌లో వచ్చిన సినిమాలన్నీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాయి. ఇక రాబోయే సినిమాలు కూడా అన్నీ భారీ బడ్జెట్‌తో రూపొందించినవే. కిక్2, రుద్రమదేవి, రామ్‌చరణ్ కొత్త సినిమా.. ఇలా వరసగా అన్నీ పెద్ద సినిమాలే కనిపిస్తున్నాయి. ప్రతి వారం ఏదో ఒక పెద్ద సినిమా రిలీజ్ అయి కొన్ని మంచి సినిమాలకు కూడా థియేటర్స్ దొరక్కుండా చేస్తున్నాయి. అలా భారీ చిత్రాల వెల్లువలో చిన్న సినిమాలు చీమల్లా కొట్టుకుపోతున్నాయి. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందనే విషయం కూడా తెలీని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వాతావరణంలో చిన్న సినిమాకి పూర్వ వైభవం వస్తుందని ఆశపడడం దురాశే అవుతుంది.