ఒక భాషలో స్టార్స్‌గా వెలుగొందుతోన్న హీరోలకు వేరే భాషలో కాస్త ఇమేజ్ వస్తే చాలు... ఇక ఆ హీరోల పాత చిత్రాలను, ఎప్పుడో వచ్చిన ఫ్లాప్ చిత్రాలను కూడా ఎడాపెడా డబ్బింగ్ చేసేస్తూ ఉంటారు. ఇది అన్ని భాషల్లో ఉండే తంతే. ఇప్పుడు అదే సమస్య ప్రభాస్‌కు వచ్చినట్లు సమాచారం. 'బాహుబలి' సంచలన విజయంతో ప్రభాస్‌కు తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో క్రేజ్ వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనలో ఆయన నటించిన 'మిర్చి' చిత్రాన్ని మలయాళంలో డబ్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే పరిస్థితి అక్కడితో ఆగితే ఫర్వాలేదు. ఎలాగూ 'మిర్చి' 'బాహుబలి'కి ముందు వచ్చిన హిట్ సినిమా కాబట్టి ఇబ్బందులు ఉండవు. కానీ ఆయన నటించిన 'ఈశ్వర్, రాఘవేంద్ర, చక్రం, మున్నా... ' ఇలా చాలా చిత్రాలను ఇతర భాషల్లో అనువాదం చేయడానికి బయటి నిర్మాతలు సన్నాహాటు చేస్తున్నట్లు సమాచారం. ఇలా తెలుగులో ఉన్న పేరు పొగొట్టుకున్న తమిళ హీరోలు చాలా మందే ఉన్నారు. వారి లిస్ట్ చెప్పాలంటే చాంతాడంత ఉంటుంది. సో... ఈ విషయంలో మాత్రం ప్రభాస్ తన నిర్మాతలను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది.