ఇప్పుడు మనకు వున్న డైరెక్టర్స్‌లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. ఒకరు భయపెట్టాలని చూస్తే, మరొకరు సినిమా అంతా నవ్వించాలని చూస్తారు. మరొకరు ఊపిరి సలపని యాక్షన్ సీన్స్‌తో సినిమాని పరిగెత్తిస్తారు. సెట్టింగ్స్‌తో గ్రాండియర్ తీసుకు రావాలని ఒకరు ప్రయత్నిస్తే, కళ్ళు చెదిరే గ్రాఫిక్స్‌తో ఆడియన్స్‌ని థ్రిల్ చెయ్యాలని మరొకరు ట్రై చేస్తారు. ఇవన్నీ పక్కన పెడితే మన డైరెక్టర్స్‌లో సెట్టింగ్స్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నది మాత్రం గుణశేఖరే. చూడాలని వుంది నుంచి లేటెస్ట్‌గా వస్తున్న 'రుద్రమ దేవి' వరకు తన ప్రతి సినిమాలో అవసరం వున్నా, లేకపోయినా ఏదో ఒక సెట్ వేయించి నిర్మాత బడ్జెట్‌ను పెంచేస్తుంటాడు. ఈమధ్యకాలంలో సక్సెస్ అనే మాట విని చాలా కాలం కావడంతో తనే నిర్మాతగా మారి భారీ బడ్జెట్‌తో చేస్తున్న 'రుద్రమదేవి' పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. సినిమాకి అవసరం లేకపోయినా సెట్స్ వేయించి బడ్జెట్ పెంచేస్తాడన్న అపప్రద వున్న గుణశేఖర్ నిర్మాతగా మారిన తను కూడా మినహాయింపు కాదని ప్రూవ్ చేసాడు. చారిత్రాత్మక చిత్రంగా తెరకెక్కిన 'రుద్రమదేవి'కి అవసరమైన భారీ సెట్స్‌ను నిర్మించి సినిమాకి గ్రాండియర్‌ని తీసుకొచ్చాడు. ఈ సినిమా చేద్దామని అనుకున్నప్పుడే బడ్జెట్ ఎక్కువ అవుతుందని తెలుసుకున్న గుణశేఖర్ మరో నిర్మాతని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ఆ రిస్కేదో తనే తీసుకొని ఎంత బడ్జెట్ అయినా వెనకాడకుండా 'రుద్రమదేవి' షూటింగ్ కంప్లీట్ చేశాడు. అప్పటివరకు అతను డైరెక్టర్‌గా సినిమాలు నిర్మించిన నిర్మాతలు సైతం గుణశేఖర్ ధైర్యాన్ని మెచ్చుకోకుండా వుండలేకపోతున్నారు. తాను నిర్మాతగా మారినప్పటికీ ఖర్చుకు వెనకాడకుండా భారీ సెట్స్ నిర్మించి డైరెక్టర్‌గానే కాదు నిర్మాతగా కూడా గ్రేట్ అనిపించుకున్నాడు గుణశేఖర్.