మొత్తానికి గుణశేఖర్ తన 'రుద్రమదేవి' ఎప్పుడొచ్చేది చెప్పేశాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తేనున్నట్లు ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించాడు. ఈ ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ఈ వ్యాఖ్యలు 'బాహుబలి'పై నెగటివ్ కామెంట్లుగా మారినట్లున్నాయని అంటున్నారు. ఆయన మాట్లాడుతూ... ఈ సినిమాని కేవలం కథని నమ్ముకొని, చరిత్రను నమ్ముకొని తీశాను. అంతేగానీ సెట్స్ కోసమో, గ్రాఫిక్స్ కోసమో తీయలేదు. అందులోనూ ఇది ఊహాజనితమైన సినిమా కాదు... చరిత్రను ఎంతో శోధించి,రీసెర్చ్ చేసి తీసిన సినిమా.. అనేది ఆయన వ్యాఖ్యల సారాంశం. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం ప్రస్తావించుకోవాలి. అసలు గుణశేఖర్ అంటేనే సెట్స్ డైరెక్టర్ అని పేరు. ఆయన చిత్రాల్లో కథ లేకపోయినా ఫర్వాలేదు కానీ సెట్టింగ్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే, గతంలో ఆయనకున్న ఇదే పిచ్చి నిర్మాతలను నిలువునా ముంచింది. దీనికి 'అర్జున్, సైనికుడు, వరుడు' వంటి అనేక చిత్రాలను ఉదాహరణగా చెప్పవచ్చు.వాస్తవానికి 'రుద్రమదేవి', 'బాహుబలి' చిత్రాలు దాదాపుగా ఒకే టైమ్‌లో ప్రారంభం అయ్యాయి. ఈ రెండు సినిమాలను జనం పోల్చి చూసుకుంటున్నారు. ఈ దశలో గుణ ఇలాంటి కామెంట్స్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అన్నట్లు 'బాహుబలి'లో అంతా బాగున్నా బలహీనమైన కథతో తీసిన సినిమా అనే విమర్శ అనేది ఉంది. దాంతో గుణ కామెంట్లు ఇప్పుడు అంతటా చర్చనీయాంశం అయ్యాయి.