యాంకర్, ప్రొడ్యూసర్ ఇలా.. పలు అవతారాలు ఎత్తిన మంచులక్ష్మి ఇప్పుడు మరో సరికొత్త పాత్రను పోషించడానికి సిద్ధమవుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడవద్దని పోలీసులు, ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా.. మందురాయుళ్లు పట్టించుకోవడం లేదు. దీనికి చెక్ పెట్టడానికి ట్రాఫిక్ పోలీసులు సరికొత్త ఆలోచన చేశారు. డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనదారులకు ఇకపై మంచులక్ష్మి చేత క్లాస్ పీకించాలనే నిర్ణయానికి వచ్చారు. దీనికి మంచులక్ష్మి కూడా పచ్చజెండా ఊపినట్లు సమాచారం.
తాగితే వచ్చే నష్టాల గురించి, కుటుంబం పడే కష్టాల గురించి, మద్యం తాగి వాహనాలు నడిపితే జరిగే ప్రమాదాల గురించి ఆమె డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డవారికి కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని మంచులక్ష్మి ఖండించింది. తాను డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారికి వీడియో మెసేజ్ ద్వారా ఇచ్చే కౌన్సిలింగ్ యాడ్‌లో మాత్రమే కనిపిస్తానని చెప్పానని, కాని వారందరికీ కౌన్సెలింగ్ ఇచ్చే సమయం తనకు లేదని స్పష్టం చేసింది. కనీసం ఆమె వీడియో కౌన్సిలింగ్ ద్వారానైనా కొందరిలోనైనా మార్పు వస్తే అదే పదివేలు కదా..!