ఇప్పుడు బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన చిత్రం ‘భజరంగీ భాయిజాన్’. ఈ చిత్రానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు సైతం ఇచ్చింది. ఇక ఈ చిత్రం ట్రైలర్ విడుదలైనప్పటి నుండి ఇది చిరంజీవి నటించిన సూపర్‌హిట్ చిత్రం ‘పసివాడి ప్రాణం’ కథ నుండి ప్రేరణ పొందింది అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదే సంగతి నిరూపితమైంది. ఈ చిత్రాన్ని చూసిన తెలుగు ప్రేక్షకులు ఇది ‘పసివాడి ప్రాణం’ నుండి కాపీ కొట్టినట్లు జోరుగా వినిపిస్తున్నారు. ఈ విషయమై ఈ చిత్ర కథారచయిత విజయేంద్రప్రసాద్ సైతం ఇది నిజమేనన్నట్లుగా మాట్లాడాడు. విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.... చిరంజీవి 1987లో నటించిన ‘పసివాడి ప్రాణం’ చిత్రం నన్ను బాగా కదిలించింది. దాన్ని పూర్తి మార్పులతో ప్రస్తుత నేపథ్యంలో తాజా పరిస్థితులను బట్టి కథ సిద్దం చేయాలనుకున్నాను. ఈలోగా ఓ పాకిస్థాని జంట తమ కుమార్తెకు గుండె ఆపరేషన్ నిమిత్తం ఇండియాకు వచ్చినట్లు ... అక్కడ ఖర్చు భరించలేక ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నట్లు మీడియాలో వార్తలు రావడం గమనించాను. దీంతో ఈ కథని సిద్దం చేశాను... అన్నారు. ‘పసివాడి ప్రాణం’ సినిమాలో మూగ అబ్బాయి చుట్టూ కథ తిరిగితే ఇక్కడ మూగ అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది. మొత్తానికి వారం రోజుల గ్యాప్‌లో రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అటు ‘బాహుబలి’తోనూ. ఇటు ‘భజరంగీ భాయిజాన్’తో బాలీవుడ్‌లోనూ సంచలన విజయాలు నమోదు చేసుకోవడం అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు.