హీరోగా తమ కెరీర్‌కు శుభం కార్డు పడిందని గ్రహించిన నిన్నటితరం హీరోలు సుమన్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్,. శ్రీకాంత్, వినోద్‌కుమార్, సాయికుమార్... ఇలా చాలామంది హీరోలు వేషాల కోసం పట్టుబట్టకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా, విలన్లుగా మారిపోయారు. ప్రస్తుతం రాజశేఖర్ కూడా అదే దారిలో నడవడానికి సిద్దం అవుతున్నాడు. హీరోగా తన పనైపోయిందని భావించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడట. అయితే ఆయన ఇంత కాలం తనకు తగ్గ, తాను చేయదగ్గ, ముఖ్యంగా చిరంజీవి 150వ సినిమాలో చిరు పాత్రకు సరిసమానంగా ఉంటే ప్రతినాయకుడిగా చేయడానికి రెడీ అని ఎప్పటినుండో చెబుతున్నాడు. అయితే ఇప్పుడు ఆ కండీషన్లన్నీ పక్కనపెట్టి అన్ని పాత్రలకు ఓకే చెప్పి, నటించడానికి సిద్దమని ఆయన తన సన్నిహితులతో చెబుతున్నాడట. అలా అయితేనే మరలా తాను బిజీగా మారుతాననే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. నిన్నటివరకు ఆయన మరో మాట చెబుతూ వస్తున్నాడు. హీరోగా అవకాశాలు లేక ఇలాంటి పాత్రలు తాను చేయడం లేదని నిరూపించాలంటే హీరోగా ఒక పెద్ద హిట్ కొట్టి అప్పుడు అన్నిపాత్రలు చేస్తానని చెప్పాడు. ఇదే విషయాన్ని ఇటీవల విడుదలైన ‘గడ్డం గ్యాంగ్’ సమయంలోనే చెప్పాడు. అయితే ఆ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో ఆయన కల నెరవేరలేదు. బయటి నిర్మాతలు ఆయనతో సినిమా తీయడానికి ముందుకు రావడం లేదు. పోనీ సొంతంగా సినిమా తీయాలంటే ఆర్థికపరిస్థితి బాగాలేదు. దీంతో ఆయన తన కండీషన్లు అన్ని పక్కనపెట్టాడట. ఆల్‌రెడీ ఆయన వద్దకు ఇలాంటి పాత్రలు చేయమని రెండు ప్రాజెక్టులు వచ్చాయట. వీటిలో తన రీఎంట్రీకి ఏది మంచి చిత్రం అనుకుంటే దానిని ఓకే చేయాలని భావిస్తున్నాడట.