ఆంద్రప్రదేశ్ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తన తనయుడు రవితేజని హీరోగా తెరంగేట్రం చేసే పనిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను మొదట తనికెళ్లభరణి చేతిలో పెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని సమాచారం. ఇప్పుడు ఈ సినిమాని దర్శకుడు మారుతి చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది. యూత్‌ఫుల్ చిత్రాలు తీస్తాడనే పేరున్న మారుతి అయితేనే తన తనయుడి అరంగేట్రానికి సరైన చాయిస్ అని గంటా భావిస్తున్నాడట. ప్రస్తుతం మారుతి నానితో ‘భలే భలే మగాడివోయ్’ అనే చిత్రం పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గంటా కుమారుడి చిత్రాన్ని కూడా గీతాఆర్ట్స్ పతాకంపై బన్ని వాసు నిర్మించనున్నాడు. ఈ విషయమై అల్లు అరవింద్‌తో ఇటీవల గంటా చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా నాని సినిమా పూర్తయిన వెంటనే మారుతి ఈ సినిమాతో బిజీ కానున్నాడు. ఆల్‌రెడీ స్క్రిప్ట్ కూడా పూర్తయిందని, ఈ కథ పట్ల గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడు రవితేజ మంచి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. మరి ఆల్‌రెడీ టాలీవుడ్‌లో ఓ రవితేజ ఉండటంతో గంటా కుమారుడి స్క్రీన్ నేమ్‌ని ఏమని పెడతారో చూడాలి..!