'బాహుబలి' కోసం ప్రభాస్ రెండున్నరేళ్లు కేటాయించాడు. మామూలుగా అయితే ప్రభాస్ జోరుకి ఆ సమయంలో రెండు మూడు సినిమాలు చేసేయొచ్చు. కానీ ఓ అంతర్జాతీయ స్థాయి సినిమాలో నటిస్తున్నానన్న నమ్మకంతో ధైర్యంగా రాజమౌళికి రెండున్నరేళ్లు కేటాయించాడు. 'మిర్చి' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ అలా ఒకే సినిమాకోసం రెండేళ్ళు కేటాయించడం గురించి పరిశ్రమలో నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకొన్నారు. కానీ ప్రభాస్ ఆ మాటల్ని పట్టించుకోలేదు. అభిమానులు డీలా పడుతున్నా, వాళ్ల నుంచి ఒత్తిడి ఎదురైనా ప్రభాస్ అనుకొన్నది చేశాడు. 'బాహుబలి' ప్రేక్షకుల ముందుకొచ్చింది. రెండున్నరేళ్ల అభిమానుల ఎదురు చూపులకు ధీటుగా తెరపై కనిపించాడు ప్రభాస్. సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో అప్లాజ్ వస్తోంది. మొత్తంగా ప్రభాస్ నమ్మకమే గెలిచింది. బాహుబలి కోసం ఆయన అందుకొన్న పారితోషికం 25కోట్లు అని మాట్లాడుకొన్నారు. అయితే ఇప్పుడు మరో కొత్త న్యూస్ బయటికొచ్చింది. 'బాహుబలి' రూః 200 కోట్లకుపైగా వసూళ్లు సాధించడం, ఆ వసూళ్లు ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ప్రభాస్‌కి నిర్మాతలు షేర్ ఇస్తున్నారట. ఆ షేర్ దాదాపుగా రూః 65కోట్లు అని తేలింది. ఆ విషయాన్ని రామ్‌గోపాల్ వర్మ బయటపెట్టాడు. ఆ లెక్కన ప్రభాస్ యేడాదికి రూః 32కోట్లు తీసుకొన్నట్టు అవుతుంది. ఈ లెక్కల్నిబట్టి చూస్తే అంత పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకొన్న తొలి దక్షిణాది కథానాయకుడు ప్రభాసే అని అర్థమవుతోంది. చూస్తుంటే ప్రభాస్ సౌత్ సూపర్‌స్టార్‌గా అవతరించేలా కనిపిస్తున్నాడు.