ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలకు కథ అందించి ఆ సినిమాలు సూపర్‌హిట్ కావడంలో కీలకపాత్ర పోషించిన వక్కంతం వంశీ అంటే హీరోలందరికీ ఇష్టమే. డైరెక్టర్ ఎవరైనా కథ వక్కంతం వంశీ అయితే సినిమా గ్యారెంటీ హిట్ అనే భావన కొంతమంది హీరోల్లో వుంది. అలా వంశీపై మంచి ఇంప్రెషన్ వున్న హీరోల్లో ఎన్టీఆర్ మొదటివాడు అని చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్ ఎంత ఇంప్రెస్ అవ్వకపోతే అతనికి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానంటాడు? కొన్నాళ్ళ క్రితం ఇదే జరిగింది. తను హీరోగా వక్కంతం వంశీ డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చేశాయి. మరో రైటర్ డైరెక్టర్ అవుతున్నాడని మీడియా హల్‌చల్ చేసింది. వంశీ కూడా తను డైరెక్టర్ అవుతున్నానని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఇప్పట్లో ఎన్టీఆర్ వంశీ డైరెక్షన్‌లో సినిమా చేసే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం సుకుమార్ కాంబినేషన్‌లో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించే సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్షన్‌లో సినిమా చెయ్యబోతున్నట్టు తెలిసింది. దీన్నిబట్టి చూస్తే ఈ రెండు సినిమాలు కంప్లీట్ అవ్వడానికి గ్యారెంటీగా ఒక సంవత్సరం పడుతుంది. అప్పటివరకు ఎవరి పరిస్థితి ఎలా వుంటుందో చెప్పలేం. కాబట్టి వక్కంతం వంశీ ఎన్టీఆర్ సినిమా మీద ఆశలు వదులుకున్నట్టుగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ సినిమాతో డైరెక్టర్ అవ్వాలనుకున్న ఎన్టీఆర్ ఆశ అడియాసే అయింది.