ఓటుకు నోటు కేసుపై ఎట్టకేలకు పవన్‌కల్యాణ్ స్పందించారు. ప్రశ్నిస్తానన్న నాయకుడు దిక్కు మొక్కు లేకుండా పోయాడంటూ విమర్శలు వినిపిస్తున్న తరుణంలో ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే అవినీతిని అంతమొందిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఓటుకు నోటు కేసు వ్యవహారంపై స్పందించి తీరు సగటు అభిమానిని కూడా తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. తెగే దాకా తీగను లాగవద్దంటూ చంద్రబాబు అండ్ కో టీం చేసిన చర్యలను మరిచిపోవాలని పవన్ చెప్పకనే చెప్పారు. అంతేకాకుండా ఇక్కడి పరిస్థితులను ఆయన సౌత్‌ఆఫ్రికా రాజకీయాలతో పోల్చడం మరో వివాదానికి దారితీసింది. పవన్ కల్యాణ్ చెప్పిన దాని ప్రకారం.. దశాబ్దాలపాటు తెల్లవారి చేతుల్లో చిత్రహింసలకు, అణిచివేతకు గురైనప్పటికీ.. అధికారంలోకి రాగానే మండేలా తెల్లవారిపై ప్రతీకారం తీర్చుకోకుండా స్నేహహస్తం అందించారన్నారు. ఇదే తీరున తెలంగాణ, ఏపీ ప్రజలు వ్యవహరించాలన్నారు. దీన్నిబట్టి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు అణిచివేతకు గురయ్యారని, సీమాంధ్రులు తెలంగాణవాసులను ఇబ్బందులకు గురిచేశారనే భావం పవన్ మాటల్లో వ్యక్తమవుతోంది. అదే నిజమైతే ఇన్నాళ్లుగా కేసీఆర్ సీమాంధ్రులపై చేస్తున్న ఆరోపణలన్నీ నిజమేనని పవన్ ఒప్పుకుంటున్నట్లే. అందుకే కేసీఆర్ సీమాంధ్రులపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని, అలాకాకుండా కేసీఆర్ కూడా నెల్సన్ మండేలాల వ్యవహరించాలని పవన్ చెబుతున్నారా అనేది అర్థం కాకుండా ఉంది. మండేలాను ఎంతగానో అభిమానించే పవన్.. ఇలా ఆయన్ను కేసీఆర్‌తో పోల్చడం అభిమానులను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది.