ఎన్నో అంచనాల మధ్య రిలీజైన రజినీకాంత్ నటించిన 'లింగా' డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు కోట్లలో నష్టం తెచ్చిపెట్టింది. తమ నష్టాలను భర్తీ చేయాలంటూ పలుమార్లు ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు పలుమార్లు ధర్నాలకు కూడా దిగారు. దీంతో దిగివచ్చిన రజినీకాంత్ డిస్ట్రిబ్యూటర్లకు రూ. 10 కోట్లు చెల్లించడానికి ఓకే చెప్పాడు. అయితే మొత్తం ఈ ఎపిసోడ్ కథాంశంగా తీసుకొని 'లింగా'కు పేరడీ చిత్రాన్ని రూపొందించడానికి తమిళనాడులో సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇందులో తమిళహాస్యనటుడు శ్రీనివాసన్ కథానాయకుడిగా నటిస్తుండగా.. 'లింగ' పంపిణీదారుల్లో ఒకరైన సింగరవేలన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తమిళనాడులో రజినీకాంత్‌ను విమర్శించడానికే వెనకడుగు వేసే చిత్రసీమ నుంచి ఆయనపైనే సెటైరికల్ మూవీ తీస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. భవిష్యత్తులో ఇది మరెన్ని వివాదాలకు ఆజ్యం పోస్తుందననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.