>‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ చేయబోయే చిత్రం గురించి రోజుకో వార్త షికారు చేస్తోంది. మొన్న హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం అని, నిన్న సునీల్‌తో చిత్రమని వార్తలు వచ్చాయి. తాజాగా మరో రెండు సినిమాల విషయంపై త్రివిక్రమ్‌కు ముడివేస్తూ వార్తలు వచ్చాయి. రచయితగా తన కెరీర్‌లో త్రివిక్రమ్ రీమేక్ సినిమాలు చేసినప్పటికీ ఆ తర్వాత దర్శకుడైన తర్వాత మాత్రం ఆయన రీమేక్ చిత్రాల వైపు వెళ్లలేదు. ‘తీన్‌మార్’ చేసినప్పటికీ అది కేవలం రచయితగా మాత్రమే. తాజాగా మలయాళంలో మమ్ముట్టి, నయనతార జంటగా చేసిన ‘భాస్కర్ ది రాస్కెల్’ సినిమా రీమేక్ హక్కులను సురేష్‌బాబు సొంతం చేసుకున్నాడు. ఈ రీమేక్‌ను ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వెంకటేష్, నయనతార జంటగా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇక మరోవైపు హారిక హాసిని సంస్థ అధినేత రాధాకృష్ణ దగ్గర నాగచైతన్య డేట్స్ ఉన్నాయి. ‘కార్తికేయ’ డైరెక్టర్ చందు మొండేటితో ఆయన నాగచైతన్య హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. నాగచైతన్య డేట్స్‌ను త్రివిక్రమ్‌కు మళ్లించి మొండేటి చిత్రాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయాలని, త్రివిక్రమ్‌తో చైతూ సినిమా పూర్తి అయినా తర్వాత మరలా చందమొండేటికి చాన్స్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఏది నిజం కానుందో వేచిచూడాల్సివుంది.