ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఒకవిధంగా గుణశేఖర్ తన ప్రాణం పెట్టి తీసిన ‘రుద్రమదేవి’ చిత్రాన్ని జూన్ 26న రిలీజ్ చేయబోతున్నట్టు ఆమధ్య ప్రకటించాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం రిలీజ్ జూన్ 30కి వెళ్ళింది. ఆ కారణాలు ఏమిటో తెలియరానప్పటికీ జూలై 10న నాలుగు భాషల్లో ఎంతో భారీ లెవల్‌లో రిలీజ్‌కి రెడీ అవుతున్న ‘బాహుబలి’ చిత్రానికి దగ్గరగా వెళ్తున్నాడు. జూన్ 30న రుద్రమదేవి చిత్రాన్ని రిలీజ్ చేస్తే అతనికి కేవలం 10 రోజులు మాత్రమే టైమ్ వుంటుంది. ఈ 10 రోజుల్లో ఈ సినిమా ఎంతవరకు నిలదొక్కుకుంటుంది, ఏమాత్రం కలెక్ట్ చేస్తుందనే విషయంలో బిజినెస్ వర్గాల్లో ఆందోళన మొదలైంది. సినిమా బాగున్నా, బాగోకపోయినా బాహుబలి కోసం రుద్రమదేవి చిత్రాన్ని ఎక్కడ కిల్ చేసేస్తారోనని అందరూ టెన్షన్ పడుతున్నారు.
ఒక చారిత్రాత్మక కథాంశాన్ని తీసుకొని భారతదేశంలోనే తొలి స్టీరియోస్కోపిక్ 3డి చిత్రంగా గుణశేఖర్ రూపొందించిన ఈ సినిమాకి సరైన రిలీజ్ డేట్ దొరక్కపోవడం బాధాకరం. ఈ సినిమాకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ జరిగి కూడా చాలా కాలమైంది. ఆ టైమ్‌లోనే సినిమాని రిలీజ్ చేసి వుంటే రెవిన్యూ పరంగా చాలా బాగుండేదని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ, ఇప్పుడు సినిమాని రిలీజ్ చేయక తప్పని పరిస్థితుల్లో జూన్ 30ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. బాహుబలి తర్వాత రిలీజ్ చెయ్యాలంటే కనీసం మరో నెలరోజులు ఆగాల్సిందే. అయితే అప్పటి పరిస్థితులు ఎలా వుంటాయో, మళ్ళీ ఏ సినిమా పోటీకి వస్తుందో తెలీదు. కాబట్టి ఏది ఎలా జరిగినా జూన్ 30న సినిమాని రిలీజ్ చెయ్యడం ఖాయమని గుణశేఖర్ భావిస్తున్నట్టు సమాచారం.