గుణశేఖర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘రుద్రమదేవి’ చిత్రాన్ని ఎట్టకేలకు జూన్ 26న రిలీజ్ చెయ్యబోతున్నట్టు ఆమధ్య ప్రకటించాడు. ఇండియాలోనే తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రంగా 70 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ చిత్రానికి మొదట్లో వున్నంత హైప్ ఇప్పుడు లేదు. ఎందుకంటే ఓ పక్క జూలై 10న మరో భారీ చిత్రం ‘బాహుబలి’ రిలీజ్ కన్‌ఫర్మ్ కావడంతో ‘రుద్రమదేవి’ రిలీజ్ విషయంలో కొంత కన్‌ప్యూజన్ ఏర్పడినట్టు తెలుస్తోంది. కొన్నాళ్ళపాటు ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి న్యూస్ బయటికి రాకపోవడం, సినిమాకి సంబంధించి ఏం వర్క్ జరుగుతోందనే న్యూస్ కూడా రాకపోవడంతో ‘రుద్రమదేవి’ని మర్చిపోయారు. జూన్ 26న సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ఆమధ్య అఫీషియల్‌గా ఎనౌన్స్ చేయడంతో ‘బాహుబలి’ చిత్రానికి 15 రోజుల ముందు వస్తోందని అందరూ అనుకున్నారు. అయితే వున్నట్టుండి ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు ప్రకటించాడు గుణశేఖర్. దీనికి సంబంధించిన న్యూస్‌లో ఎక్కడా రిలీజ్ డేట్‌ని మెన్షన్ చెయ్యకపోవడంతో 26కి ఈ సినిమా రిలీజ్ అవ్వడం డౌటేనని అర్థమవుతోంది. ఈ డేట్‌కి సినిమా రిలీజ్ కాకపోతే కనీసం రెండు నెలలు ఆగాల్సి వుంటుంది. అప్పటివరకు ‘రుద్రమదేవి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాకపోతే సినిమా పరిస్థితి ఏమిటనేది ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ జూన్ 26కే రిలీజ్ చేసేందుకు గుణశేఖర్ సిద్ధమైతే దానికి సంబంధించి ఎలాంటి పబ్లిసిటీ ఇంకా స్టార్ట్ చెయ్యలేదు. ఇదంతా చూస్తుంటే ‘రుద్రమదేవి’ రిలీజ్ విషయంలో గుణశేఖర్ ఇంకా డైలమాలోనే వున్నట్టు తెలుస్తోంది.