అప్పుడెప్పుడో కెరీర్‌ని ప్రారంభించాడు నితిన్. సీనియర్ కథానాయకుల జాబితాలోకి ఎప్పుడో చేరిపోయాడు. రాఘవేంద్రరావు, పూరి జగన్నాథ్, రాజమౌళి, తదితర స్టార్ దర్శకులందరితోనూ పనిచేశాడు. అలాంటి నితిన్‌కి తొలి అడుగులు వేస్తున్న మెగాహీరో వరుణ్ తేజ్ పోటీగా నిలుస్తున్నాడా? టాలీవుడ్ వర్గాలు అవుననే సమాధానమే వినిపిస్తున్నాయి.
నితిన్ ప్రేమకథల్లోనే ఎక్కువగా నటిస్తుండొచ్చు కానీ... ఆయనకి మాస్ ఇమేజ్ కూడా ఉంది. అందుకే మాస్ అంశాలతో మిళితమైన ప్రేమకథలన్నీ ఆయన దగ్గరికి వస్తూ ఉంటాయి. ఆ తరహా ఇమేజ్ ఉన్న యువ కథానాయకులెవ్వరూ టాలీవుడ్‌లో లేకపోవడం ఇన్నాళ్లూ బాగా కలిసొచ్చింది. అయితే ఇప్పుడు నితిన్‌కి ప్రత్యామ్నాయం దొరికాడు అన్నట్టు వరుణ్‌తేజ్‌వైపు చూస్తోంది చిత్ర పరిశ్రమ.
మెగా కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు కాబట్టి వరుణ్‌తేజ్‌ని ఆటోమేటిక్‌గా మాస్ ఇమేజ్‌తో చూస్తారంతా. అదే సమయంలో ఈ జనరేషన్ ప్రేమకథలకి తగ్గట్టుగా కూడా ఆయన కనిపిస్తుంటాడు. సో... నితిన్‌తో తీయాల్సిన కథల్ని వరుణ్‌తో నిస్సందేహంగా తీయొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘హార్ట్‌ఎటాక్’ కథని వరుణ్‌తేజ్ కోసమే రాసుకొన్న పూరి అనుకోకుండా నితిన్‌తో తీశాడు. ఇప్పుడు నితిన్‌కోసం రాసుకొన్న కథని వరుణ్‌తేజ్‌తో తీయడానికి సిద్ధమవుతున్నాడు. ఆ రకంగా చూస్తే... నితిన్‌కి వరుణ్ ప్రత్యామ్నాయం అయిపోయాడన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఆ లెక్కన నితిన్ ఇకనుంచి జాగ్రత్తపడాల్సిందే మరి...!