దాదాపు రెండున్నరేళ్లుగా తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'బాహుబలి'. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా పెద్ద ఎత్తుర విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. గతంలో ఏ తెలుగు చిత్రానికి లేనంత మొత్తంలో 'బాహుబలి' బిజినెస్ చేయనుంది. ఇంతవరకు బాగానే ఉన్నా తమిళ్ మీడియాతో రాజమౌళి మాట్లాడుతూ ఓ కొత్త సంగతిని బయటపెట్టారు. ఈ చిత్రం బడ్జెట్ రూ. 300 కోట్లు అంటూ బాంబు పేల్చాడు.
మొదటినుంచి కూడా ఈ సినిమా బడ్జెట్ రూ.150 కోట్లు అంటూ వార్తలు వెలువడుతున్నాయి. అయితే రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ సినిమా ఒక్కొక్క పార్ట్ ఖర్చే రూ. 150 కోట్లు అంటూ రాజమౌళి స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీన్నిబట్టి ఈ సినిమా మొదటి పార్ట్, రెండు పార్ట్ కనీసం రూ. 150 కోట్ల చొప్పున బిజినెస్ చేయాల్సి ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ మార్కెట్‌ను బట్టి ఒక సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయితే రూ. 60 కోట్ల వరకు రావచ్చు. అటు తమిళ్, హిందీ భాషల్లో కూడా ఆదాయాన్ని కలుపుకుంటే మరో రూ. 40 కోట్లు వసూలయ్యే అవకాశం ఉంది. ఇక మిగిలిన మొత్తాన్ని శాటిలైట్ రైట్స్ రూపంలో దక్కించుకోవాల్సి ఉంటుంది. మొదట అనుకున్న వంద కోట్లలో కూడా డిస్టిబ్యూటర్స్, థియేటర్ల వాటాను తీయాల్సి ఉంటుంది. ఇలా అయితే ఏ లెక్కన చూసినా ఈ సినిమా లాభాలు తెచ్చిపెట్టే అవకాశాలు చాలా తక్కువే. మరి ఇలాంటి తరుణంలో ప్రొడ్యూసర్ ఇంత రిస్క్ ఎలా చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భారీ సినిమాకు తగినట్లే రాజమౌళి కూడా ఓ భారీ గాసిప్ పుట్టించారన్న చర్చ ఇండస్ట్రీలో కొనసాగుతోంది.