కొత్తవాళ్లతో సినిమాలు తీసి విజయాలు అందుకోవడంలో తేజకి మంచి ట్రాక్ రికార్డే ఉంది. `చిత్రం`, `జయం`, `నువ్వు నేను`లాంటి చిత్రాలతో ఆయన పరిశ్రమలో ఓ విప్లవాన్ని సృష్టించాడు. ఆయా చిత్రాల్లో నటించినవాళ్లు స్టార్లుగా కూడా ఎదిగారు. ఆ తర్వాత కూడా అదే తరహాలో తేజ కొన్ని ప్రయత్నాలు చేశారు కానీ సక్సెస్ అవ్వలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా ఇప్పుడు మళ్లీ కొత్తవాళ్లతోనే `హోరా హోరీ` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కె.ఎల్.దామోదర్‌ప్రసాద్ నిర్మాత. దిలీప్, దక్ష నాయకానాయికలుగా పరిచయమవుతున్నారు. అబ్బాయి ఓకే కానీ... అమ్మాయి మాత్రం అదిరిపోయింది. మంచి నటీనటుల్ని వెదికిపట్టుకోవడంలో తేజ సిద్ధహస్తుడు. సినిమా ఫలితం ఎలాగున్నా అందులో నటించినవాళ్లకు మాత్రం బోలెడన్ని అవకాశాలు వస్తుంటాయి. ఇప్పుడు పలు చిత్రాల్లో నటిస్తూ దూసుకెళుతున్న నందిత కూడా తేజ సినిమాతో పరిచయమైందే. దక్ష కూడా ఇండస్ట్రీకి కీలక కథానాయికగా మారేలా కనిపిస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అన్నట్టు `హోరా హోరీ` చిత్రం పూర్తయింది. ఈ నెలలోనే పాటల్ని, వచ్చే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట.