ప్రభాస్ అభిమానులకు శుభవార్త. `బాహుబలి` ఆడియో వేడుక ఫిక్సయినట్టు సమాచారం. ఈనెల 10న రామోజీ ఫిల్మ్‌సిటీలో పాటల విడుదల కార్యక్రమం జరపాలని బాహుబలి టీమ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ... ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. దాదాపు 20 వేల మంది అభిమానుల్ని ఈ వేడుకకు ఆహ్వానిస్తారని తెలుస్తోంది. ఇదివరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో వేడుక జరపాలని అనుకొన్నారు. అయితే భద్రతా కారణాలవల్ల పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవేళ ఫంక్షన్ తప్పక జరుపుకోవాలి అనుకొంటే పరిమిత సంఖ్యలోనే అభిమానుల్ని ఆహ్వానించాలని చెప్పారట. అసలే డార్లింగ్ అభిమానులు మాంచి ఆకలిమీదున్నారు. వాళ్లు బాహుబలి ఆడియో వేడుక కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నారు. అలాంటప్పుడు మళ్లీ పరిమిత సంఖ్యలో అంటే గొడవలైపోతాయని భావించిన రాజమౌళి అండ్ టీమ్ వేడుకని వాయిదా వేసింది. ట్రైలర్స్‌తో వాళ్లను కొన్నాళ్లుగా సందడి చేయిస్తోంది. తాజాగా ఆడియో విడుదల వేదికని రామోజీ ఫిల్మ్‌సిటీకి మార్చి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిల్మ్‌సిటీ బాగానే ఉంటుందని పోలీసు వర్గాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయట. రామోజీ ఫిల్మ్‌సిటీలో గ్రాండ్‌గా, బాహుబలి స్థాయి తెలిసేలా ఓ భారీ సెట్ ఏర్పాటు చేసే పనిలో చిత్రబృందం ఉంది.