రవితేజ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ‘కిక్’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ ఆరు సంవత్సరాలు కావస్తోంది. దానికి సీక్వెల్‌గా ‘కిక్2’ చెయ్యాలని వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ మళ్ళీ సినిమాలు తీసేందుకు సిద్ధంగా లేకపోవడంవల్ల ఎన్.టి.ఆర్. ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్‌రామ్ ఆ బాధ్యతను తీసుకున్నాడు. ఇప్పటివరకు కళ్యాణ్‌రామ్ నిర్మించిన చిత్రాల కంటే ఎక్కువ బడ్జెట్‌తో ఎంతో లావిష్‌గా తీసిన ఈ సినిమాపై కళ్యాణ్‌రామ్‌తోపాటు రవితేజ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈమధ్యకాలంలో కాస్త ఫామ్ కోల్పోయిన రవితేజకు సురేందర్‌రెడ్డి మంచి కిక్ ఇస్తాడని భావిస్తున్నాడు. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తామనే విషయం ఆడియో ఫంక్షన్‌లో కూడా ప్రకటించలేదు.
యూనిట్ సభ్యులు చెప్పిన దాన్నిబట్టి జూన్ మొదటి వారంలోనే సినిమాను రిలీజ్ చేస్తారని తెలిసింది. అయితే మొదటివారంలో సినిమా రిలీజ్ చేసే అవకాశం లేదనేది మనకు అర్థమవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని, అందుకే రిలీజ్ లేట్ అవుతోందన్నది మరో కారణం. ఎట్టి పరిస్థితుల్లో జూన్ 26న సినిమాని రిలీజ్ చెయ్యాలని కళ్యాణ్‌రామ్ డిసైడ్ అయ్యాడు. అయితే అప్పటికి కూడా సినిమా రెడీ అవ్వకపోతే జూలై 3కి వస్తారట. ఇదిలా వుంటే జూలై 10న బాహుబలి చిత్రాన్ని రిలీజ్ చేస్తామని చాలా రోజులుగా చెప్తూ వస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమా రిలీజ్ తర్వాత మహేష్ ‘శ్రీమంతుడు’ వారం గ్యాప్‌లో వచ్చేస్తుంది. కాబట్టి ‘కిక్2’ని జూన్ 26కి రిలీజ్ చేసుకుంటేనే ఎంతో కొంత ఉపయోగముంటుంది తప్ప జూలై 3కి వెళ్ళడం వల్ల సినిమా ఎంత బాగున్నా కళ్యాణ్‌రామ్ అనుకున్న రేంజ్‌లో రెవిన్యూ రాదన్నది వాస్తవం. జూలై 3కి రిలీజ్ చేస్తే ప్రభాస్, మహేష్ సినిమాల మధ్యలో ‘కిక్2’ ఆడియన్స్‌కి అంత కిక్ వుండదు.