సూపర్‌స్టార్స్‌తో సినిమాలు చేయాలని అందరికీ ఉంటుంది. అయితే అందుకోసం సుదీర్ఘకాలం అంటే 35సంవత్సరాల పాటు ఎదురుచూడటం అంటే మాటలు కాదు. అటువంటి అరుదైన ఫీట్‌ను తమిళ నిర్మాత కలైపులి థాను చేశాడు. ఆయన ఎదురుచూపులకు ఇన్నాళ్లకు ఫలితం లభించింది. ఆయన నిర్మాతగా రజనీకాంత్ హీరోగా రంజిత్ అనే యువదర్శకునితో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం ఆగష్టులో పట్టాలెక్కనుంది. మొదట మలేషియాలో 60రోజుల భారీ షెడ్యూల్, ఆతర్వాత చెన్నై, హాంకాంగ్‌లలో మరో 60రోజుల షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ చిత్రం అఫీషియల్‌గా అనౌన్స్ కావడంతో కలైపులి థాను సంతోషంతో ఉప్పొంగిపోతున్నాడు. రజనీకాంత్ అభిమానిగా నిర్మాణరంగంలో అందరికీ సుపరిచితుడైన ఆయన ప్రస్తుతం నిర్మాతల మండలి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాడు. అంతేకాదు. రజనీకాంత్‌కు సూపర్‌స్టార్ అనే బిరుదును ఇచ్చింది కూడా ఆయనే. 40ఏళ్ల క్రితం డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన థాను.. రజనీ నటించిన ‘భైరవి’ చిత్రాన్ని రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేశాడు. ఇందులో రజనీ పేరు ముందు సూపర్‌స్టార్‌ను చేర్చి ప్రచారం చేశాడు. ఆ తర్వాత రజనీ నటించిన ‘అన్నామలై, ముత్తు, భాషా’ చిత్రాలను ఆయనే నిర్మించనున్నట్లు ప్రచారం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆయా చిత్రాలను ఆయన నిర్మించలేకపోయాడు. ఇప్పుడు 35ఏళ్ల తర్వాత ఆయనకు రంజిత్ చిత్రంతో ఆ అవకాశం వచ్చింది.