నెల్లూరులో పీసీసీ ఉపాధ్యక్షుడు ఆనం వివేకానందరెడ్డి, నిర్మాత సి.కల్యాణ్‌ల మధ్య వివాదం ముదురుతోంది. 'బస్తీ మే సవాల్ కొట్టుకుందాం రా..' సవాల్ చేసుకునే వరకూ వీరి వివాదం ముదిరింది. ఇక అంతటితో ఆగకుండా నిర్మాత కల్యాణ్ ఆనంకు ఓ హెచ్చరిక పంపాడు. ఆనం చేష్టలపై 'రంభతో లాలికాడు' అనే సినిమా తీసే యోచన ఉందని చెప్పాడు. మరి కల్యాణ్ హెచ్చరికలపై ఆనం ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సి ఉంది.
అయితే వీరిద్దరి మధ్య వివాదానికి నెల్లూరు జిల్లాలోని ఓ స్థలం కారణంగా తెలుస్తోంది. రూ. 1.60 కోట్లకు సదరు స్థలాన్ని తాను కొనుగోలు చేశానని కల్యాణ్ చెబుతుంటే.. లేదు వక్ఫ్‌బోర్డుకు చెందిన ఆ స్థలాన్ని కల్యాణ్ కబ్జా చేసుకున్నారంటూ ఓ వర్గం ఆరోపిస్తోంది. ఈ ఆరోపణల వెనుక ఆనం వివేకానందరెడ్డి ఉన్నారని, ఆ స్థలంలో ఆయనకు వాటా ఇవ్వకపోవడంతోనే ఇలా లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నారని కల్యాణ్ ఆరోపించారు. వివేకానందరెడ్డికి పిచ్చి పట్టిందని, అందుకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. ఇక ఈ విషయాలన్ని పక్కనపెడితే ఆనం వివేకానందరెడ్డి చేష్టలపై ఓ సినిమా తీస్తే కామెడీ అదిరిపోతుందని బీ, సీ క్లాసు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.