రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘బాహుబలి’ చిత్రం ఫీవర్ రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఈ చిత్రం కోసం టోటల్‌గా దేశం మొత్తం ఎంతో క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. కరణ్‌జోహార్ ‘బాహుబలి’ చిత్రం బాలీవుడ్ రైట్స్ తీసుకోవడంతో ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది. కాగా ‘బాహుబలి’ ముందు ప్రస్తుతం రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఏ భాషా చిత్రం కూడా ఇంకా 100కోట్ల క్లబ్బులో చేరలేదు. అక్షయ్ ‘బేబీ’, ‘గబ్బర్’లు 80కోట్ల వద్ద ఆగిపోయాయి. ఇక జులై వరకు మరో పెద్ద చిత్రం విడుదలకు సిద్దంగా లేదు. దీంతో ‘బాహుబలి’ ఈ ఏడాది 100కోట్ల క్లబ్‌లో చేరే తొలి భారతీయ చిత్రం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే ఇప్పటివరకు ఇక్కడ 100కోట్ల క్లబ్బులో ఒక్క చిత్రం కూడా చేరలేదు. పవన్‌కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ మాత్రమే దానికి దగ్గరి వరకు వెళ్లగలిగింది. కాగా ‘బాహుబలి’ 100కోట్లు వసూలు చేసిన తొలి తెలుగు చిత్రంగా రికార్డ్ సృష్టించడానికి సిద్దం అవుతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ‘బాహుబలి’ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలంటే జులై 10వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.