మెగాస్టార్ చిరంజీవి 150 వచిత్రం తమ కుటుంబానికి ఓ మైల్‌స్టోన్ మూవీగా మిగిలిపోవాలని మెగా ఫ్యామిలీ ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికీ మెగాస్టార్ 150వ చిత్రం హ్యాంగోవర్ నుండి మెగాభిమానులు బయటపడలేకపోతున్నారు. కాగా చిరు నటించే చిత్రంలో తనకు చిన్న పాత్ర దక్కినా తన అదృష్టంగా భావిస్తానని ఆయన తనయుడు రామ్‌చరణ్ ఇప్పటికే ప్రకటించేశాడు. తన తండ్రితో కలిసి నటించే అవకాశం వస్తే ఇక దానిని తాను వదులుకొనే ప్రసక్తే లేదని అంటున్నాడు. గతంలో రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘మగధీర’ చిత్రంలో మెగాస్టార్ కొన్ని నిమిషాలు తెరపై మెరిసిన సంగతి తెలిసిందే. కాగా చిరు 150వ చిత్రంలో అతిథి పాత్రలో చేయాలనే ఆశతో అల్లుఅర్జున్ ఉన్నాడట. ఇప్పటికే ఆయన తన కోరికను చిరుకు తెలిపాడని, ఇందుకు చిరు సైతం అనుకూలంగా స్పందించాడని సమాచారం. ఇక మెగాఫ్యామిలీ నేటితరం హీరోలైన వరుణ్‌తేజ్, సాయిధరమ్‌తేజ్‌లు కూడా ఈ చిత్రంపై కోటి ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ సోదరుడు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌ను సైతం తెరపై కనిపించే విధంగా స్కెచ్ వేశారని, ఆయనను అందుకు ఒప్పించే పనిలో ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి మెగాస్టార్ 150 వ చిత్రం మెగాఫ్యామిలీ రూపు సంతరించుకునే దిశలో అడుగులు వేస్తున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం జరుగుతోంది.