అది సూర్య కొత్త సినిమా ‘రాక్షసుడు’ ఆడియో ఫంక్షన్. సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరోల ఆడియో ఫంక్షన్లు ఎక్కువగా జరిగే శిల్పకళావేదికలో ఈ ఫంక్షన్ జరగడం, అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు కూడా లాఠీలకు పని కల్పించాల్సి వచ్చింది. ఇదిలా వుంటే ఆడిటోరియంలోకి సూర్య రాగానే ప్రేక్షకులు, అభిమానులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేస్తూ అతన్ని ఆహ్వానించారు. ఊహించని ఈ హఠాత్ పరిణామానికి సూర్య ఒకింత షాక్‌కి గురయ్యాడు. సూర్య అంటే యూత్‌లో కొంత క్రేజ్ వున్న మాట వాస్తవమే గానీ ఈ రేంజ్‌లో తనకి స్వాగతం లభిస్తుందని సూర్య కూడా ఊహించి వుండడు. ఫంక్షన్ స్టార్ట్ అవ్వకముందు ఒకసారి స్టేజ్ మీదకు వచ్చిన సూర్య అభిమానుల హర్షధ్వానాల మధ్య, విజిల్స్ మధ్య ‘లవ్ యు’ అని పదే పదే అనడం తప్ప ఏమీ మాట్లాడలేక స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు.
ఇంతవరకు బాగానే వుంది గానీ ఈ ఫంక్షన్‌కి ప్రభాస్, రాజమౌళి గెస్ట్‌లుగా రానున్నారని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరగడంతో అక్కడికి వచ్చినవారిలో ఎక్కువ శాతం ప్రభాస్ ఫ్యాన్సేనని, పనిలో పనిగా సూర్యని కూడా తమ హర్షధ్వానాలతో ఎత్తేశారని ప్రేక్షకులు చెప్పుకోవడం వినిపించింది. ప్రభాస్ వచ్చిన తర్వాత ఆడిటోరియంలో కోలాహలం మరింత పెరగడంతో సూర్యకి అసలు విషయం అర్థమైనట్టు అతని ఎక్స్‌ప్రెషన్స్‌లో కనిపించింది. ఏది ఏమైనా ఈమధ్యకాలంలో ఒక డబ్బింగ్ సినిమా ఆడియో ఫంక్షన్ ఇంత గ్రాండ్‌గా, అభిమానుల సందడితో జరగడం ‘రాక్షసుడు’ చిత్రానికి మాత్రమే జరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.