లేటెస్ట్ మూవీ ‘లయన్’ తర్వాత నందమూరి బాలకృష్ణ చేయబోయే చిత్రానికి లక్ష్యం ఫేమ్ శ్రీవాస్ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘డిక్టేటర్’ అనే టైటిల్‌ని కూడా అనుకున్నారు. సింహా, లెజెండ్, లయన్... ఇలా అన్నీ పవర్‌ఫుల్ మూవీస్ చేస్తూ వస్తున్న బాలకృష్ణ కోసం ఎలాంటి సబ్జెక్ట్ అయితే బాగుంటుందన్న విషయంలో గతంలో చాలా టెన్షన్ పడిన శ్రీవాస్ ‘డిక్టేటర్’ స్టోరీ నేరేట్ చెయ్యడం అది ఓకే అయిపోవడం కూడా జరిగిపోయింది. అయితే ‘లయన్’లాంటి పవర్‌ఫుల్ మూవీకి కూడా డివైడ్ టాక్ రావడం, కొన్నిచోట్ల బాగుందన్న టాక్ రావడం, కలెక్షన్లు కూడా ఒక్కో ఏరియాలో ఒక్కోలా వుండడంతో శ్రీవాస్ తను రెడీ చేసుకున్న కథలో మార్పులు చేస్తే బాగుంటుందన్న ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. కానీ, బాలకృష్ణ సన్నిహితులు, శ్రీవాస్ శ్రేయోభిలాషుల సలహా మేరకు తను ఏదైతే కథ అనుకున్నాడో దాన్నే పర్‌ఫెక్ట్‌గా హ్యాండిల్ చేసి ఒక కొత్త బాలకృష్ణను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి సిద్ధమయ్యాడట. సింహా, లెజెండ్, లయన్ చిత్రాలకు భిన్నంగా వుండే డిక్టేటర్ క్యారెక్టరైజేషన్ ఇంతకుముందు బాలకృష్ణ చెయ్యలేదని, తప్పకుండా ఇది బాలకృష్ణకు, ఆయన అభిమానులకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుందని కథ గురించి తెలిసినవారు చెప్తున్నారు. ఏది ఏమైనా శ్రీవాస్ ఇప్పుడు డిక్టేటర్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్‌తో వున్నాడని తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ 99వ చిత్రంగా తెరకెక్కనున్న ‘డిక్టేటర్’ మే 29న చాలా గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోంది. ‘లయన్’తో అభిమానుల్లో కొత్త ఆనందాన్ని నింపిన బాలకృష్ణ ‘డిక్టేటర్’తో మరో కొత్త అవతారానికి శ్రీకారం చుట్టబోతున్నాడన్నమాట.