కథానాయికలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ప్లాన్ చేస్తుంటారు. తమకు నేమ్, ఫేమ్ ఉన్నప్పుడే ఇతరత్రా వ్యాపారాల్లోకి అడుగుపెట్టి వాటికి క్రేజ్‌ని తీసుకొస్తుంటారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోయినా ఆ వ్యాపారాలే ముద్దుగుమ్మలకి ప్రధాన ఆదాయ వనరుగా మారుతుంటాయి. ఇప్పటికే పలువురు కథానాయికలు హోటల్, రియల్ ఎస్టేట్, స్పా... తదితర వ్యాపారాల్లో విశేషంగా రాణిస్తున్నారు. తాజాగా తాప్సీ కూడా అలాంటి ఓ సైడ్ బిజినెస్ మొదలెట్టింది. తన చెల్లి షగుణ్, ఫ్రెండ్ పర్వరేష్‌తో కలిసి వెడ్డింగ్ ఫ్యాక్టరీ.కో పేరుతో ఓ సంస్థను ప్రారంభించింది. మేరేజెస్ ఆర్గనైజింగ్ కంపెనీ అన్నమాట. వెడ్డింగ్ ప్లానర్స్‌గా వీళ్లు సేవలందిస్తారు. పెళ్లి పత్రిక చేతిలో పెడితే చాలు... అందుకు సంబంధించిన ప్రతీదీ వీళ్లే చూసుకొంటారు. అమ్మాయి తరఫువాళ్లు, అబ్బాయి తరఫువాళ్లు అలా వచ్చి ఇలా విందు ఆరగించి వెళ్లిపోవాలన్నమాట. ఢిల్లీ, ముంబై వేదికగా ఈ సంస్థ వెడ్డింగ్స్‌ని ప్లాన్ చేస్తుంది. మొత్తంగా తాప్సి మంచి బిజినెస్‌నే మొదలెట్టింది కదా!