మరోసారి నాగచైతన్య, సమంత కలిసి మాయ చేస్తారని పరిశ్రమలో ప్రచారం సాగింది. కానీ అది వీలుపడలేదు. సమంత తన కాల్షీట్లన్నీ తమిళ చిత్రాలకి కేటాయించింది. దీంతో నాగచైతన్యతో కలిసి మరోసారి నటించడం కుదరలేదు. సమంత స్థానంలో ఓ మలయాళ భామకి అవకాశం దక్కింది. `ఏమాయ చేసావె` తరహాలోనే చైతూ, సమంత జంటగా ఓ చిత్రం చేయాలని ప్లాన్ చేశాడు గౌతమ్‌మీనన్. అయితే చివరి నిమిషంలో సమంత కాల్షీట్లు లేవని చెప్పింది. దీంతో ప్రత్యామ్నాయంగా మలయాళ ముద్దుగుమ్మ మంజిమ మోహన్‌ని ఎంపిక చేసుకొన్నాడు. ఆమెకూడా సమంతలాగే ముఖారవిందంతో కనిపిస్తోంది. మరి `ఏమాయ చేసావె`తో పరిచయమైన సమంత తరహాలోనే మంజిమ కూడా తెలుగులో వరుస అవకాశాల్ని అందుకొంటుందేమో చూడాలి.