వరుస ఫ్లాప్‌ల్లో ఉండి శాటిలైట్ మార్కెట్‌లో తప్ప థియేటర్ మార్కెట్ చాలా తగ్గిపోయిన హీరో ఎవరంటే సిద్దార్ధ్ పేరే చెప్పాలి. దీనికి ఆయనకు మీడియాతో గొడవలు కారణమా..? లేక సరైన సినిమాలు పడకపోవడమా? ఏది కారణం..? ఈ స్థితికి కారణం ఏమిటి? అనేది ఎవ్వరికి అర్థం కావడం లేదు. తమిళంలో విజయవంతం అయిన చిత్రం ‘ఎనకులళ్ ఒరువన్’ చిత్రాన్ని తెలుగులో ‘నాలో ఒక్కడు’గా అనువాదం చేసి విడుదల చేశారు.
సిద్దార్ధ్, దీపాసన్నిధి జంటగా ప్రసాద్ రమర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే చాలా థియేటర్లలో కనీసం 20మంది కూడా వుండటం లేదు. దానికి కారణం... సిద్దార్ధ్ పబ్లిసిటీ క్యాంపెయిన్‌లో పాల్గొనకపోవటమే ప్రధానకారణం అంటున్నారు. తన సినిమాపై తనకే శ్రద్ద లేకపోవడంతో తన చేతులతో తన సినిమాను చంపేసినట్టైందని ట్రేడ్‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోవడమే కొంతలో కొంత ఊరట. మాటీవీ వారు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్‌ను 75లక్షలు వెచ్చించి తీసుకున్నట్లు సమాచారం.