పోటీ అంటే అది సమ ఉజ్జీల మధ్య జరిగితేనే రంజుగా ఉంటుంది. అప్పుడే ఎవరి సత్తా ఏమిటి? అనేది తేలిపోతుంది. త్వరలో అలాంటి హోరాహోరి పోరుకు రంగం సిద్దమవుతోంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా దాదాపు 100కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో రూపొందుతోన్న ‘బాహుబలి’ చిత్రాన్ని జులై 10వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే ఒకసారి విడుదల తేదీ మార్చినందుకు బాధపడుతున్న ‘బాహుబలి’ టీమ్ ఎట్టిపరిస్థితుల్లోనూ జులై 10న ఆ సినిమాను విడుదల చేయడానికి రెడీ అవుతోంది. అదే సమయంలో వరుసగా రెండు డిజాస్టర్స్ ‘1’(నేనొక్కడినే), ‘ఆగడు’ చిత్రాల ద్వారా తన అభిమానులను కూడా భారీగా డిజప్పాయింట్ చేసిన టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఈ సారైనా ఈ రెండు ఫ్లాప్‌లను మించిన హిట్ కొట్టాలనే కసితో కొరటాల శివ చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ చిత్రానికి ‘శ్రీమంతుడు’ అనే వర్కింగ్‌టైటిల్ ప్రచారంలో ఉంది. కాగా ఈ చిత్రాన్ని జులై 17న విడుదల చేస్తామని డేట్‌ను కూడా లాక్ చేశారు. మరి రెండు వరుస వారాలలో రెండు భారీ చిత్రాలు పోటీ పడితే అందులో ఎవరు గెలుస్తారు? అనే ఉత్కంఠ ఉండటం సహజం. కానీ ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం ప్రకారం మహేష్‌బాబునే ఆ తేదీని వాయిదా వేయించి మరో వారం పోస్ట్‌పోన్ చేసి ‘బాహుబలి’కి రెండు వారాల గ్యాప్ తీసుకుంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి.