మార్కెట్లో పరిస్థితులు ఎప్పుడు ఏ సినిమాకి అనుకూలంగా మారుతాయో, ఎప్పుడు మరే సినిమాని దెబ్బ కొడతాయో ఎవ్వరం చెప్పలేం. మామూలు సినిమాలు సైతం ఒక్కోసారి అదరగొడుతుంటాయి. బాగున్న సినిమాలు కూడా ఒక్కోసారి అనూహ్యరీతిలో వెనుదిరుగుతుంటాయి. ఆ సమయంలో బాక్సాఫీసు దగ్గర వాతావరణమే ఆయా సినిమాల ఫలితాల్ని ప్రభావితం చేస్తుంటాయి. ఇటీవల కాలంలో ఏ సినిమా కూడా ప్రేక్షకుల్ని చెప్పుకోదగ్గ స్థాయిలో అలరించలేదు. అందుకే తెలుగు ప్రేక్షకుడు మంచి సినిమా కోసం మొహం వాచిపోయేలా ఎదురు చూస్తున్నాడు. ఈవారం భారీగా పోటీ ఉండేలా కనిపించింది. అయితే `గంగ`, `ఉత్తమ విలన్` చిత్రాలు మాత్రమే బరిలోకి దిగాయి. రెండు సినిమాలు కూడా రకరకాల కారణాలవల్ల విడుదల విషయంలో ఆలస్యమయ్యాయి. అయితే లారెన్స్ `గంగ` మాత్రం మొదట విడుదలైంది. ఆ సినిమా బీ, సీ కేంద్రాల జనాలకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. నిజానికి అదొక సాదాసీదా సినిమానే. అయితే బాక్సాఫీసు దగ్గర ఏవీ సరయిన సినిమాలు లేకపోడంతో అంతా `గంగ`కోసం థియేటర్‌కి కదులుతున్నారు. దీంతో తొలిరోజే ఆ సినిమాకి భారీగా వసూళ్లొచ్చాయి. శనివారం `ఉత్తమ విలన్` విడుదలైంది. చాలా చోట్ల ఫస్ట్ షో, సెకండ్‌షోల నుంచి సినిమా ప్రదర్శన మొదలైంది. అప్పుడు `గంగ` జోరు కాస్త తగ్గినట్టనిపించింది. అయితే ఆదివారం ఉదయానికే `ఉత్తమవిలన్` గురించి ఓ రకమైన ప్రచారం రావడంతో మళ్లీ `గంగ`కే వాతావరణం అనుకూలంగా మారింది. మొత్తమ్మీద కీలకమైన ఈ వీకెండ్ లారెన్స్‌కి అనుకూలంగా మారిందన్నమాట.