మళ్లీ క్రికెట్ సమరం ప్రారంభం కాబోతోంది. అదేంటి ఇప్పటికే ఐపీఎల్ టోర్నీ కొనసాగుతోంది కదా.. అన్న అనుమానం వచ్చిందా..?. ఇది క్రికెట్ వీరుల సమరం కాదండోయ్. సినీ తారల క్రికెట్ యుద్ధం. తెలంగాణ ప్రభుత్వ పథకాలకు చేయూతనందించడానికి క్రికెట్ టోర్నీని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ రామకృష్ణగౌడ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుసుకున్న ఆయన ఈమేరకు సీఎం ముందు ప్రతిపాదనలు ఉంచారు. కేవలం టాలీవుడ్‌నుంచి కాకుండా కోలీవుడ్‌నుంచి కూడా సినీ తారలు ఈ క్రికెట్ టోర్నీలో పాల్గొంటారని చెప్పారు. జూన్ 21నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీ నిర్వహణ ద్వారా.. ప్రసార హక్కులు, టికెట్ల అమ్మకం తదితర మార్గాల్లో దాదాపు రూ. 12 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వానికి చేయూతనందించడానికి నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నీ ఘనవిజయం సాధించేలా కేసీఆర్ కూడా కృషి చేస్తారని చెప్పడానికి ఎలాంటి అనుమానం అక్కరలేదనుకుంటా..!