నిశ్చితార్థం జరగ్గానే త్రిష ఇక తెరమరుగవుతుందేమో అనుకొన్నారంతా. కానీ ఆమె చిత్రంగా నిశ్చితార్థం తర్వాతే జోరు పెంచింది. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ వరసబెట్టి అవకాశాలు అందుకొంటోంది. దీంతో వరుణ్‌తో త్రిష పెళ్లి జరుగుతుందో లేదో అన్న అనుమానాలు మొదలయ్యాయి. దాని గురించి రకరకాలుగా మాట్లాడుకొంటున్నాయి. అయితే తన పెళ్లి గురించి ఎవరేమనుకొంటున్నా త్రిష మాత్రం తన జోరును ఆపడం లేదు. సినిమాలపై ఫుల్లుగా కాన్సంట్రట్ చేస్తోంది. తాజాగా శింబుతో కలిసి నటించేందుకు ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. శింబు కథానాయకుడిగా సెల్వ రాఘవన్ ఓ చిత్రం తెరకెక్కించబోతున్నారు. ఇదివరకే ఆ సినిమా ప్రయత్నాలు జరిగాయి. అయితే ఏమైందో తెలియదు కానీ... ఉన్నట్టుండి ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి. కానీ తాజాగా మళ్లీ సినిమాని పట్టాలెక్కించాలని సెల్వ, శింబు నిర్ణయించారు. అందులో త్రిషని ఓ కథానాయికగా ఎంచుకొన్నారు. ఇందులో మరో కథానాయికకి కూడా చోటుంది. ఆ అవకాశాన్ని దీక్షాసేథ్‌కి అప్పగిస్తారని కొన్నాళ్లక్రితం వరకు ప్రచారం సాగింది. అయితే శింబు తనకి దీక్షా వద్దని, తాప్సీ కావాలని కోరాడట. దీంతో తాప్సిని ఓకే చేశారని ప్రచారం సాగుతోంది. ఈ సినిమా తెలుగులోనూ విడుదలయ్యే అవకాశాలున్నాయి.