అటు తమిళ్.. ఇటు తెలుగు ఇండస్ట్రీల్లో నం.1 హీరోయిన్‌గా త్రిష ఏళ్లపాటు చెలామణి అయ్యారు. సౌందర్య తర్వాత త్రిష మాత్రమే ఇంత సుదీర్ఘకాలం ఎలాంటి బ్రేక్ లేకుండా అగ్ర నాయికగా కొనసాగారు. దాదాపు 15 ఏళ్లపాటు ఈ రెండు ఇండస్ట్రీలను ఓ ఊపు ఊపిన త్రిష వేగం ఈ మధ్యే కాస్త తగ్గింది. ఇక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా త్రిష పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్‌తో పెళ్లికి పచ్చజెండా ఊపారు. ఇక జనవరిలో కూడా అత్యంత సన్నిహితుల మధ్య వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత మరో నెలలోనే ఆమె వివాహం ఉండవచ్చని సన్నిహితులు మీడియాకు సమాచారం ఇచ్చారు. ఈ మధ్య అగ్రనటుల వివాహ వేడుకలు కరువైన మీడియా కూడా త్రిష పెళ్లి గురించి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే జనవరి.. ఫిబ్రవరి.. మార్చి.. ఏప్రిల్ పోయి మే వస్తున్నా... ఆమె పెళ్లికి సంబంధించి ఏ సమాచారం బయటకు రావడం లేదు. దీంతో వారిద్దరి మధ్య బెడిసికొట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై స్వయంగా త్రిషనే క్లారిటీ ఇస్తేనే బాగుంటుందేమో. ఇక తెలుగులో ఆమె నటించిన 'లయన్' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.