కామెడీ కోసం మన డైరెక్టర్లు కొత్త రూటు వెత్తుక్కుంటున్నారు. తమ రంగానికే చెందిన స్టార్‌హీరోల మీద సెటైరిక్ పాత్రలు సృష్టించి వినోదం పండిస్తున్నారు. వాస్తవానికి ఈ తరహా కామెడీకి తెరతీసింది ‘ఖడ్గం’ చిత్ర దర్శకుడు కృష్ణవంశీ. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూపృథ్వీ చేత ఆయన చేయించిన పాత్ర ఒక్కసారిగా సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. ఆ తర్వాత శ్రీనువైట్ల తన ‘దుబాయ్‌శ్రీను’ చిత్రంలో ఎమ్మెస్ నారాయణ చేత ఫైర్‌స్టార్ సాల్మన్‌రాజు పాత్ర చేయించాడు. ఆ తర్వాత మరలా శ్రీనువైట్లనే ‘కింగ్’ చిత్రంలో బ్రహ్మానందం చేత సంగీత దర్శకుడి వేషం వేయించి నవ్వులు పూయించాడు. ఇలా కమెడియన్స్‌తో స్టార్‌హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్ల వంటి పాత్రలు సృష్టించి సెటైర్లు పేలుస్తున్నారు. ‘లౌక్యం’ చిత్రంలో బాయిలింగ్ స్టార్ పాత్ర, ‘పటాస్’ చిత్రంలో ‘సునామీ స్టార్ సుభాష్’గా ఎమ్మెస్‌నారాయణ, తాజాగా వచ్చిన నాగచైతన్య ‘దోచెయ్’ చిత్రంలో టెమ్టింగ్‌స్టార్ బుల్లెట్‌బాబుగా బ్రహ్మానందం చేత చేయించిన కామెడీ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఇలా తమపై తామే సెటైర్లు వేసుకోవడం పట్ల ఇండస్ట్రీలోని చాలా మంది దర్శకులపై విమర్శలు గుప్పిస్తున్నారు.