మాస్‌లో ఎన్నటికీ తరగనంత క్రేజ్ బాలయ్య సొంతం. అందుకే ఆయన సినిమాలకి ఓపెనింగ్స్ భారీగా వస్తుంటాయి. ఆ సినిమాకి బాగుందన్న టాక్ కూడా వచ్చిందంటే ఇక పట్టపగ్గాలుండవు. బాక్సాఫీసు దగ్గర కొత్త రికార్డులు నమోదవుతూ ఉంటాయి. అలాంటి బాలయ్య నటించిన ఓ కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందంటే పోటీగా మరొకరు బాక్సాఫీసు ఛాయలకి వచ్చే ధైర్యం చేస్తారా? ఛాన్సే లేదు. నిన్నటిదాకా బాలకృష్ణ నటించిన `లయన్` మే 1న ప్రేక్షకుల ముందుకొస్తుందని ప్రచారం సాగడంతో `దాగుడు మూత దండాకోర్` మినహా మరో సినిమా విడుదల తేదీ ఖరారు కాలేదు. రెండు మూడు వారాలు బాలయ్యకే అంకితం చేద్దామనుకొన్నారు. అయితే బాలయ్య మే 1న రావడం లేదని తాజాగా తెలియడంతో చిన్న సినిమాలు ఒక్కసారిగా ముందుకొచ్చాయి. లక్ష్మీప్రసన్న నటించిన `దొంగాట` మే 1న విడుదలవుతోంది. అలాగే సిద్ధార్థ్ నటించిన `నాలో ఒకడు` కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చేలా కనిపిస్తోంది. వీటితో పాటు మరో రెండు మూడు చిత్రాలు అదే రోజున విడుదలయ్యేలా ప్లాన్ చేసుకొంటున్నాయి. బాలకృష్ణ `లయన్` మాత్రం మే 7న విడుదలవుతోంది. డీటీఎస్ పనుల్లో జాప్యం జరుగుతండడమే సినిమా విడుదల తేదీ వాయిదాకి కారణం అని సమాచారం.