మణిరత్నం దర్శకత్వం వహించిన ఓకే బంగారం సినిమా మరో దర్శకుడికి ప్రేమకథ రాయాలనేంతగా స్ఫూర్తిని కలిగించిందని తమిళ మీడియాలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ జంటగా నటించిన ఈ ద్విభాషా చిత్రం ఇటివలే విడుదలయ్యింది. సహజీవనం నేపధ్యంలో మణిరత్నం తీసిన బంగారంలాంటి ప్రేమ కావ్యం సినీ ప్రముఖులు, విమర్శకులు, సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ కు ఈ చిత్రం విపరీతంగా నచ్చింది.
ఓకే బంగారం చిత్రాన్ని చూసిన వెంటనే సోషల్ మీడియాలో దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ ల నటనతో పాటు మణిరత్నంపై పొగడ్తల వర్షం కురిపించారు. నాకు ప్రేమకథ రాస్తున్నంత ఫీలింగ్ కలిగింది. మణిరత్నం మరోసారి ట్రెండ్ సృష్టించారని అన్నారు. 'ఏం మాయ చేశావే', 'ఎటో వెళ్ళిపోయింది మనసు' వంటి ప్రేమకథా చిత్రాలు గౌతమ్ మీనన్ తీశారు. మణిరత్నం స్ఫూర్తితో తన తర్వాత సినిమాకు ప్రేమకథ రాయడానికి రెడీ అవుతున్నారట.