అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలబడాలనే ఆశయంతో, తెలుగు సంస్కృతి సంప్రదాయలను కాపాడాలనే సమున్నత లక్ష్యంతో, "భాషే రమ్యం- సేవే గమ్యం" అనే నినాదంతో ఆవిర్భవించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) అంచెలంచలుగా ఎదుగుతూ అమెరికాలోని తెలుగుజాతి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది.
ప్రతి రెండేళ్లకోసారి వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను ఈ ఏడు జూలై 2,3,4 తేదీల్లో లాస్ ఏంజిల్స్ లో జరగనున్నాయి. లాస్ ఏంజిల్స్ లోని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక స్థలం డిస్నీ ల్యాండ్ సమీపంలో దాదాపు 300,000 చదరపు అడుగుల సువిశాల ప్రాంగణంలో ఈ వేడుకలు జరిపేందుకు రంగం సిధ్ధమయ్యింది. అందులో దాదాపు 50,000 చదరపు అడుగులను స్టాల్స్ కోసం కేటాయించనున్నారు. అమెరికాలోని వేరు వేరు ప్రాంతాలకు చెందిన సుమారు 500 తెలుగు ప్రముఖుల ఆథ్వర్యంలో జరగబోయే ఈ వేడుకకు రమారమి 10000 మంది హాజరయ్యేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కళా, సాంస్కృతిక, వ్యాపార రంగాలకి సంబంధించిన అనేక కార్యక్రమాలకుగాను వేర్వేరు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు నాట్స్ నిర్వాహకులు. నేడు (18 ఏప్రిల్) అమెరికాలో నాట్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టార్నమెంట్ ను ప్రారంభిస్తున్నారు. ఈ టార్నమెంట్ లో వేరు వేరు నగరాలనుంచి విజేతలుగా నిలిచినవారందరూ జూలైలో జరగబోయే నాట్స్ వేడుకల్లో భాగంగా తలపడనున్నారు. ఈ సంబరాల సందర్భంగా అమెరికావ్యాప్తంగా ఉన్న తెలుగు పిల్లలకు చిత్రలేఖనంలో పోటీలు నిర్వహించనున్నారు. మహిళా కార్యక్రమాల్లో భాగంగా నారీ సదస్సులు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా విజ్ఞుల ప్రవచనాలు కూడా ఈ నాట్స్ వేడుకల్లో భాగం కానున్నాయి.
జూలై 2,3,4 తేదీల్లో లాస్ ఏంజిల్స్ లో జరిగే ఈ వేడుకలకు ఆధ్యాత్మిక గురువు దత్తపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ, కేంద్ర మంత్రి శ్రీ వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఆంధ్రప్రదేశ్ శాసనసభాధిపతి డా కోడెల శివప్రసాద్, తెలంగాణా రాష్ట్ర గనులు, శాసనసభావ్యవహారాల శాఖామాత్యులు శ్రీ హరీశ్ రావు, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీ మాణిక్యాలరావు, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖామాత్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ రావు, పౌర సరఫరాల శాఖామాత్యులు శ్రీమతి పరిటాల సునీత, మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి దగ్గుబాటి పురదేశ్వరి, కూచిపూడి నాట్యారామం చైర్మన్ శ్రీ ఆనంద్ కూచిభొట్ల హాజరౌతుండగా తెలుగుచలనచిత్ర రంగానికి చెందిన నటసింహ శ్రీ నందమూరి బాలకృష్ణ, శ్రీ రాజేంద్ర ప్రసాద్ , శ్రీ కె రాఘవేంద్ర రావు, గోపీచంద్, నాని, కాజల్ హాజరౌతున్నారని నాట్స్ కార్యవర్గం తెలియజేసింది. అక్కడ జరిగే సంగీత సాహిత్య కార్యక్రమాల్లో తనికెళ్ల భరణి, ప్రముఖ గాయకులు డా గజల్ శ్రీనివాస్, అనూప్ రూబెన్స్, వందేమాతరం శ్రీనివాస్, అనంత్ శ్రీరాం, సిరాశ్రీ, భాస్కరభట్ల రవికుమార్, తెలంగాణా ప్రజాగాయకులు గోరేటి వెంకన్న, గాయని స్వర్ణక్క, అమ్మపాట తిరుపతన్న తదితరులు పాల్గోనున్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పై వివరాలను ఫిల్మ్ నగర్ క్లబ్ లో జరిగిన ప్రత్యేక పాత్రికేయ సమావేశంలో నాట్స్ పూర్వ అధ్యక్షులు డా. రవి మాదాల, శ్రీ దేసు గంగాధర్ లు తెలియజేశారు.
"జూలైలో జరగబోయే 2015 నాట్స్ అమెరికా సంబరాలు మునుపెన్నడూ జరగని విధంగా ఆద్యంత వినోదభరితంగా ఉంటాయి. తెలుగు వారి కీర్తిని ఇనుమడింపజేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ గ్రంథి మల్లికార్జున రావు గారికి ఈ సంబరాల్లో జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేస్తుండడం ఎంతో ఆనందదాయకం" అని నాట్స్ కాన్-ఫెరెన్స్ చైర్మన్ డా రవి ఆలపాటి, అధ్యక్షులు శ్రీ రవి ఆచంట అమెరికా నుంచి పంపిన తమ సందేశాల్లో తెలిపారు.
సినీ రచయిత సిరాశ్రీ సంధానకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో నాట్స్ ఇండియా కో -ఆర్డినేటర్ శ్రీ రాజ ఆలపాటి, నాట్స్ ప్రముఖులు శ్రీ రతీష్ అడుసుమిల్లి, శ్రీ ప్రసన్న కోట, శ్రీ గోపి ఆచంట, శ్రీ వినయ్ జొన్నలగడ్డ, శ్రీ అమర్ అన్నె, శ్రీ కిశోర్ మల్లిన, శ్రీ టి జి విశ్వ, పీపుల్ టెక్ కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.